టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టిఆర్ ఎస్ లో అంతర్యుద్ధం కొనసాగుతుందని , హరీష్ రావు అందులో ఇమడలేకపోతున్నారన్నారు. ఎప్పటికైనా టిఆర్ ఎస్ చీలిపోతుందన్నారు.
ప్రజాకూటమికి, టిఆర్ ఎస్ కు సమానంగా సీట్లు వస్తే అందులో కొన్ని తీసుకొని హరీష్ రావు సీఎం అవుతారన్నారు. హరీష్ రావు సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నారని, కేసీఆర్ అభద్రతా భావంలో ఉన్నారన్నారు. కేసీఆర్ కూతురు, కొడుకుకే ప్రాధాన్యతనివ్వటం హరీష్ కు నచ్చడం లేదన్నారు.
వైఎస్ బతికుంటే హరీష్ రావు కాంగ్రెస్ లో చేరేవారన్నారు. ఇప్పటికైనా హరీష్ రావు సీఎం కావాలనే లక్ష్యంతోనే ఉన్నారని అదును చూసి దెబ్బకొట్టడం ఖాయమన్నారు. రేవూరి వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి. గత కొంతకాలంగా టిఆర్ ఎస్ లో హరీష్ కు సరైన ప్రాధాన్యత దక్కడం లేదనే వార్తలు పుకార్లు చేస్తున్నాయి. హరీష్ రావు అమిత్ షాని కలిశారని, పార్టీని వీడనున్నారని తొలుత వార్తలు వచ్చాయి. కేసీఆర్ తన కుమారుడు కేటిఆర్ ని సీఎం చేయాలనే ఆలోచనతో హరీష్ కు ప్రాధాన్యత తగ్గిస్తున్నారని చర్చ జరిగింది.
ఇటీవల గజ్వేల్ కాంగ్రెస్ అభ్యర్ధి వంటేరు ప్రతాప్ రెడ్డి కూడా హరీష్ రావు పై సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీష్ తనకు ఫోన్ చేసి మామ కేసీఆర్ ను ఓడించాలని, అవసరమైన డబ్బు, వసతులు సమకూరుస్తానన్నారని ఆరోపించారు. గుర్తు తెలియని నంబర్ నుంచి పోన్ చేశాడని తెలిపారు. ఇది రాజకీయంగా పెద్ద చర్చకే దారి తీసింది. అసలే టెన్షన్ ల ఉన్న హరీష్ కు వంటేరు మాటలు పెద్ద షాకిచ్చాయి. వంటేరు వ్యాఖ్యల పై హరీష్ స్పందించారు. దమ్ముంటే వంటేరు ఆధారాలతో్ సహా నిరూపించాలన్నారు. రాజకీయంగా ఎదుర్కోలేక వంటేరు ఈ విధమైన నీచ రాజకీయాలు చేస్తున్నారన్నారు. తాను చివరి అంకం వరకు మామ తోనే ఉంటానని హరీష్ రావు తెలిపారు.
ఇప్పుడు టిడిపి నేత రేవూరి ప్రకాశ్ రెడ్డి కూడా ఆగ్నికి ఆజ్యం పోసేలా మాట్లాడటంతో రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ జరుగుతోంది. నిజంగానే హారీష్ రావు టిఆర్ ఎస్ ను వీడనున్నారా, పార్టీలో చీలిక ఖాయమని అంతా చర్చించుకుంటున్నారు. ట్రబుల్ షూటర్ గా పేరున్న హారీష్ నిజంగానే చక్రం తిప్పనున్నారనే చర్చ జరుగుతోంది. టిఆర్ ఎస్ పరిస్థితి ఏ విధంగా మారనుందో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.