వైసిపికి 23 ఎంపిలు..టైమ్స్ నౌ సంచలనం

రాబోయే లోక్ సభ ఎన్నికల్లో వైసిపి 23 పార్లమెంటు స్ధానాలు గెలుచుకుంటుందని జాతీయ మీడియా జోస్యం చెప్పింది. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో  ఏపిలో ఏ పార్టీ ఎక్కువ సీట్లు గెలుచుకుంటుంది అనే విషయమై టైమ్స్ నౌ, విఎంఆర్ ప్రాజెక్ట్స్ సంయుక్తంగా సర్వే నిర్వహించాయి. ఆ సర్వేలో 49.5 శాతం ఓట్లతో వైసిపి 23 లోక్ సభ సీట్లు గెలుచుకుంటుందనే ఫలితం తేల్చింది. అధికార తెలుగుదేశంపార్టీకి కేవలం రెండంటే రెండు లోక్ సభ సీట్లు మాత్రమే దక్కుతుందని కూడా సర్వే స్పష్టం చేస్తోంది. అంటే ఇటువంటి సర్వేల్లో చెప్పినట్లే ఫలితాలు ఉంటాయని నమ్మేందుకు లేదుకానీ జనాల మూడ్ ను ఓ అంచనాగా తీసుకోవచ్చు.

ఇటువంటి సర్వేల వల్ల రాజకీయ పార్టీలకు ఓ వెసులుబాటు ఉంటుంది. మెజారిటీ సీట్లు తెచ్చుకుంటుందని వచ్చిన సర్వేతో సదరు పార్టీ ఖుషీగా ఉంటే స్ధానాలు పోతాయని వచ్చిన పార్టీ జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంది. అదే విధంగా వైసిపికి 49.5 శాతం జనాలు ఫేవరబుల్ గా ఉన్నారని సమాచారం. అంటే మొన్నటి వరకూ జరిగిన సర్వేల్లో వైసిపికి 43 శాతం ఓట్లే వచ్చాయి. అంటే కొద్ది కాలంలోనే సుమారు 6 శాతం ఓట్లు పెరిగినట్లు స్పష్టమవుతోంది. అదే సమయంలో టిడిపి 36 శాతం ఓట్లు తెచ్చుకుంటుందని వెల్లడైంది. ఇక్కడ కూడా ఓ విషయం గమనించాలి. టిడిపికి కూడా పోయిన సర్వేలతో పోల్చుకుంటే 3 శాతం ఓట్లు పెరిగాయి.

ఇంట్రస్టింగ్ పాయింట్ ఏమిటంటే జనసేన, బిజెపి, కాంగ్రెస్ పార్టీలు సోదిలోకి కూడా లేకుండా పోయాయి. బిజెపికి 4.8 శాతం ఓట్లు, కాంగ్రెస్ కు 2.5 శాతం ఓట్లు వస్తాయని తేలింది. అయితే సీట్లు మాత్రం సున్నాయే. జనసేనకైతే అసలు ఓట్ల శాతం కూడా రాలేదు. అంటే బిజెపి, కాంగ్రెస్ పార్టీలకన్నా జనసేన పరిస్ధితి కనాకష్టంగా ఉందని ఓ అంచనాకు రావచ్చు. షెడ్యూల్ ఎన్నికలు దగ్గర పడేకొద్దీ ఇంకెన్ని సంస్ధలు సర్వేలతో ఏపిని హోరెత్తిస్తాయో చూడాల్సిందే.