ఆంధ్రా, తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల పై జాతీయ చానెల్ సంచలన సర్వే

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత ఇప్పుడు దృష్టంతా పార్లమెంటు ఎన్నికల పై పడింది. కానీ పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే దాని పై రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ నెలకొంది. ఎన్నికలకు ఇంకా నాలుగు నెలల సమయం ఉండగానే ఎన్నికల పై పలు సంస్థలు, జాతీయ ఛానెళ్లు సర్వేలు చేస్తున్నాయి. ఆ సర్వేల రిపోర్టు పలు పార్టీలకు ఆనందానిస్తుండగా మరి కొన్ని పార్టీలకు ఉత్కంఠను రేపుతున్నాయి.

తాజాగా జాతీయ చానల్ అయిన రిపబ్లిక్ టివి సీ ఓటర్ తో కలిసి పార్లమెంట్ ఎన్నికల పై సర్వే నిర్వహించింది. అందులో భాగంగా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లకు సంబంధించి నిర్వహించిన సర్వే రిపోర్టును విడుదల చేసింది. తెలంగాణలో ఇటివల అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. టిఆర్ ఎస్ పార్టీ అఖండ మెజార్టీతో విజయ దుందుంభి మోగించింది. దీంతో టిఆర్ఎస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా విజయం సాధ్యమేనని అంతా చర్చించుకున్నారు. మరి కొంత మంది మాత్రం పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీనే గెలుస్తుందనే ధీమాలో ఉన్నారు.

రిపబ్లిక్ సర్వే తెలంగాణ ఫలితాలు

అయితే ఈ అంచనాలన్ని తలకిందులు చేస్తూ రిపబ్లిక్ టివి సర్వే ఉంది. తెలంగాణలో టిఆర్ఎస్ కు అడ్డు లేదని తేల్చేసింది. 17 స్థానాల్లో 16 స్థానాలు గెలుస్తుదని, ఒక స్థానంలో ఎంఐఎం గెలుస్తుందని సర్వేలో తెలిపింది. ఎంఐఎం పోటి చేస్తున్న హైదరాబాద్ స్థానంలో టిఆర్ఎస్ అభ్యర్ధి పోటి చేయడం లేదు. దీంతో తెలంగాణలో టిఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేస్తుందని తేల్చింది.  మిగిలిన పార్టీలకు అసలు అవకాశమే లేదని రిపబ్లిక్ సర్వేలో తేలింది.

ఆంధ్రలో పార్లమెంటు ఎన్నికల ఫలితాలు ఇలా ఉన్నాయి

ఆంధ్రప్రదేశ్ లో మాత్రం పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలు ఒకే సారి జరగనున్నాయి. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్ది ఏపీ రాజకీయాలలో కీలక మార్పులు వస్తున్నాయి. ఏపీలో టిడిపి కాంగ్రెస్ పొత్తు పై స్పష్టత లేదు. ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే వైసిపికే అనుకూలంగా ఉందని రిపబ్లిక్ సర్వేలో తేలింది.  టిడిపి కాంగ్రెస్ పొత్తు ఖాయమేనన్న వార్తల నేపథ్యంలో రిపబ్లిక్ టివి వారి పొత్తును తీసుకొని సర్వే చేసింది. 25 పార్లమెంట్ స్థానాలు ఉన్న ఏపీలో వైసిపికి 14, టిడిపికి,  కాంగ్రెస్ కి 11 వస్తాయని తేల్చింది. 8 స్థానాలు టిడిపి, 3 స్థానాలు కాంగ్రెస్ గెలుస్తుందని తేల్చింది.

వైసిసికి 41.6 శాతం ఓట్లు, టిడిపి, కాంగ్రెస్ కూటమికి 38.2 శాతం , బిజెపికి 11 శాతం, ఇతరులకు 9 శాతం ఓట్లు వస్తాయని రిపబ్లిక్ టివి సర్వేలో తేల్చింది. అయితే ఇదే రిపబ్లిక్ టివి అక్టోబర్ లో సర్వే చేసింది. అప్పుడు టిడిపి కాంగ్రెస్ కలవలేదు. అప్పుడు వైసిపికి 21 , టిడిపికి 4 వస్తాయని తేల్చింది. పొత్తు పెట్టుకోవడం వలన టిడిపికి బలం చేకూరి 4 నుంచి 11 కు పెరిగిందని సర్వే చెప్తుంది. పొత్తులు ఏపీ రాజకీయాలలో అనూహ్య మార్పులను తీసుకువస్తున్నాయి.

ఏపీలో ఫలితాలు ఇలా ఉన్నాయి

మొత్తానికి జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలని రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు ప్రయత్నిస్తున్నారు. ఓ వైపు కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ కోసం ప్రయత్నాలు చేస్తుంటే మరోవైపు చంద్రబాబు కాంగ్రెస్ తో కలిసి కాంగ్రెస్ గెలిచేలా ప్రయత్నాలు చేస్తున్నారు. రిపబ్లిక్ సర్వే ప్రకారం తెలంగాణలో టిఆర్ఎస్ గెలుపు ఖాయమని తేలింది. ఏపీలో మాత్రం పరిస్థితులు తారుమారు కావచ్చని తెలుస్తోంది. పొత్తులు కొనసాగితే మాత్రం టిడిపి కాంగ్రెస్ లదే పై చేయి కావచ్చని సర్వే రిపోర్టులో తేలింది.