ఎన్నికలు కొద్దిరోజులు ఉన్నాయనగా.. టీవీ ఛానళ్లు గానీ, కొన్ని మీడియా సంస్థలు గానీ సర్వేల మీద పడతాయి. జనం పల్స్ తెలుసుకోవడానికి సర్వేలు చేస్తుంటాయి. వాటి ఫలితాలు ఇలా ఉండొచ్చు అని అంటూ ఓ అంచనాకు వస్తాయి. వాటిని టెలికాస్ట్ చేస్తుంటాయి.
ఆయా సర్వేల ఫలితాలకు కాస్త అటు, ఇటుగానే ఎన్నికల ఫలితాలు వెలువడుతుంటాయి. అది సహజం. ఒకట్రెండు నేషనల్ మీడియా ఛానళ్లు మన రాష్ట్రంపై ప్రత్యేకంగా నిఘా వేశాయా? అనిపించేలా వ్యవహరిస్తున్నాయి. టైమ్స్ నౌ, రిపబ్లిక్ టీవీ ఛానళ్లు నెల, నెలన్నర రోజుల వ్యవధిలో ఒకసారి చొప్పున లోక్‌సభ స్థానాలపై సర్వేలు చేస్తూ వస్తున్నాయి.
మిగిలిన రాష్ట్రాలు, ఎన్డీఏ, యూపీఏలకు వచ్చే సీట్ల సంఖ్యను గానీ పక్కన పెడితే ఏపీలో లోక్‌సభ స్థానాల్లో ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేస్తుందనే సంకేతాలను ఇస్తున్నాయవి. రాష్ట్రంలో మొత్తం 25 లోక్‌సభ స్థానాలకు వైఎస్ఆర్ సీపీ 20 స్థానాల్లో జెండా ఎగుర వేస్తుందని కొద్దిరోజుల కిందటే రిపబ్లిక్ టీవీ ఛానల్ ఓ కథనాన్ని ప్రసారం చేసింది.
రిపబ్లిక్ టీవీ ఛానల్ ఇలాంటి సర్వేను టెలికాస్ట్ చేయడం కొత్తేమీ కాదు. 2-3 నెలల వ్యవధిలో ఒకసారి చొప్పున వాటిని ప్రసారం చేస్తూనే ఉంది. తాజాగా టైమ్స్ నౌ కూడా.. తాను చేసిన సర్వేను వెల్లడించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్‌కు 23 ఎంపీ సీట్లు వస్తాయని ప్రకటించిందా ఛానల్. వైఎస్ఆర్ సీపీ లోక్‌సభ స్థానాలను క్లీన్‌స్వీప్ చేస్తుందని, తెలుగుదేశం పార్టీ రెండు స్థానాలకే పరిమితం అవుతుందని అంచనా వేసింది.
ఆయా సర్వేల్లో వాస్తవం ఎంత? వాటిని ఎంతవరకు విశ్వసించవచ్చు. క్షేత్రస్థాయిలో ప్రజల పల్స్ ఎలా ఉంది? బలమైన క్యాడర్ ఉన్న అధికార తెలుగుదేశం పార్టీ రెండు లేదా మూడు స్థానాలకే పరిమితం అవుతుందా? అని ప్రశ్నిస్తే- మిశ్రమ సమాధానాలే వినిపిస్తున్నాయి.
తెలుగుదేశం పార్టీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అతి పెద్ద బలం. ఆయనకు టానిక్ లాంటిది అనుకూల మీడియా. చంద్రబాబు గానీ, ఆయన అనుకూల మీడియా గానీ తలచుకుంటే ఏమైనా చేస్తాయి. చేస్తున్నాయి కూడా.
చంద్రబాబు హోదా వద్దు, ప్యాకేజీనే కావాలి అని అంటే.. దానికి అనుకూలంగా తమ కథనాలను వండి వార్చాయి అనుకూల మీడియా సంస్థలు. తూచ్. ప్యాకేజీ అసలే వద్దు హోదానే ముద్దు అని చంద్రబాబు అంటే- దానికి అనుకూలంగా తాళం వేస్తున్నాయి. జనాల మైండ్‌సెట్‌ను కూడా అలాగే మార్చి వేస్తున్నాయి. ఈ విషయంలో చాలావరకు చంద్రబాబు గానీ, కొన్ని మీడియా సంస్థలు గానీ విజయం సాధించాయి.
తిమ్మిన బమ్మిని చేయగల, పందిని నందిగా చూపించగల సత్తా ఉన్న చంద్రబాబు నాయుడు, అనుకూల మీడియా అండగా ఉండగా.. తెలుగుదేశం పార్టీ నామమాత్రపు సంఖ్యలో లోక్‌సభ స్థానాలను సాధించుకుంటాయని భావిస్తే పొరపాటే అవుతుంది.
`పోల్ మేనేజ్‌మెంట్` చేయడంలో చంద్రబాబును మించిన నాయకుడు లేరనే అనుకోవచ్చు. సర్వేలు ఎంతటి ప్రతికూలంగా ఉన్నా, ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉన్నా, పోలింగ్ సమయానికి వాటన్నింటినీ అధిగమించగలరాయన. నంద్యాల ఉప ఎన్నిక దీనికి ఓ నిలువెత్తు ఉదాహరణ.
రాజధాని అమరావతిలో తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలిక హైకోర్టు భవనాలను కట్టినట్టే, ప్రజల అవసరాలను కూడా తాత్కాలికంగా తీర్చేయడంలో చంద్రబాబు దిట్ట. 2014 ఎన్నికల సమయంలోనూ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూల పవనాలు వీచాయనే విషయం గుర్తుండే ఉంటుంది. ఇంకేముంది- జగనే ముఖ్యమంత్రి అనే టాక్ సర్వత్రా వినిపించింది. దీన్ని పరిగణనలోకి తీసుకునే.. చంద్రబాబు అలవికాని హామీలను ఇచ్చారు. ఏ పార్టీ ఇవ్వని విధంగా, రికార్డు స్థాయిలో 600లకు పైగా హామీలను ఇచ్చారు.
వాటిలో ఎన్ని నెరవేరాయి? ఎన్నింటిని మధ్యలోనే ఆపివేశారు? ఎన్ని హామీలను అసలు పరిగణనలోకి కూడా తీసుకోలేదు? ఎన్ని హామీలను ఎన్నికల ముంగిట్లో అమల్లోకి తీసుకొచ్చారనే విషయం ప్రజలకు తెలుసు. ఇన్ని చేసినప్పటికీ- అతి తక్కువ మార్జిన్‌తో గెలిచింది టీడీపీ. ఒకసారి అధికారం చేతికి అందితే.. దాన్ని అంత సులువుగా వదిలి పెట్టరు చంద్రబాబు.
వాటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే- సర్వేలు వెల్లడించినంత సులువుగా వైఎస్ఆర్ సీపీ గెలుపు ఉండకపోవచ్చు. సర్వేలను చూసుకుని, మురిసిపోతూ, తమ గెలుపు నల్లేరు మీద నడకే అనుకుని నిర్లక్ష్యంగా ఉంటే దానికి తగిన మూల్యాన్ని చెల్లించుకోవాల్సి రావచ్చు.
రాష్ట్రంలో ఉన్న 25 లోక్‌సభ స్థానాల్లో ఇప్పటికీ టీడీపీ చాలాచోట్ల బలంగా ఉంది. హిందూపురం సీటులో నిమ్మల కిష్టప్ప పాతుకుని పోయారు. చిత్తూరులో డాక్టర్ ఎన్ శివప్రసాద్ చెప్పిందే వేదవాక్కు. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం లోక్‌సభ స్థానం ఎర్రన్నాయుడు కుటుంబానికి అండగా ఉంటోంది.
గుంటూరు, నరసరావు పేట స్థానాల్లో కమ్మ సామాజిక వర్గం ఓటర్లు శాసించే స్థాయిలో ఉన్నారు. విజయవాడ, మచిలీపట్నం, ఏలూరు వంటి ఎంపీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులను ఢీ కొట్టాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ తన సర్వశక్తులను ధారపోయాల్సి ఉంటుంది. అనంతపురం లోక్‌సభ స్థానం పరిధిలో జేసీ కుటుంబం పెత్తనం ఏ రేంజ్‌లో ఉందో తెలిసిందే.
టీడీపీ స్వతహాగా బలహీనంగా ఉన్న కర్నూలు, నంద్యాల వంటి చోట్ల ప్రతిపక్ష పార్టీని గెలవనీయకుండా చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో, అన్నింటినీ చేస్తుంది. తాను గెలవకపోయినా ఫర్వాలేదు.. తన ప్రథమ శతృవు మాత్రం గెలవకూడదనేది చంద్రబాబు ప్రాథమిక సూత్రం. వాటన్నింటినీ తుత్తునీయలు చేయాలంటే వైఎస్ఆర్ సీపీ తన తాహతుకు మించి శ్రమించాల్సి ఉంటుంది.
సర్వేల ఫలితాలు నిజమవుతాయో లేదో గాని, ఇదొక సంచలనం. ఎందుకంటే, ఈ సర్వేలో కాంగ్రెస్ బిజెపిలకు జీరో వచ్చింది. మరొక విచిత్రం సర్వేలో పవన్ కల్యాణ్ నాయకత్వంలోని జనసేన ప్రస్తావనే లేదు. అంటే జనసేన లెక్కలోనే లేదా? అదే చిత్రం.