టిడిపి ఎంఎల్ఏలకు పదవీ గండం ?

క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరికీ అలాగే అనిపిస్తోంది. ముగ్గురు ఎంఎల్ఏల అనర్హతపై వైసిపి నేతలు కోర్టుకెక్కిన విషయం తెలిసిందే. ఎన్నికల అఫిడవిట్లలో తప్పుడు సమాచారం ఇచ్చారని, కేసుల లాంటి విషయాలను దాచిపెట్టారన్న కారణంతో వైసిపి నేతలు కోర్టులో కేసులు వేశారు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ముగ్గురు ఎంఎల్ఏలపై అనర్హత వేటు పడే అవకాశాలే ఎక్కువున్నట్లు సమాచారం.

విషయాల్లోకి వస్తే ముందుగా పెద్దాపురం ఎంఎల్ఏ, మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప మీద వైసిపి నేత తోట వాణి కోర్టుకెక్కారు. అఫిడవిట్లో తనపై ఉన్న కేసులను చూపలేదని, ఆదాయాల విషయంలో తప్పుడు సమాచారం ఇచ్చారనేది వాణి అభియోగం. నిజానికి వాణి వాదనే కరెక్టట.

అలాగే చీరాల ఎంఎల్ఏగా గెలిచిన కరణం బలరామ్ పైన వైసిపి నేత ఆమంచి కృష్ణమోహన్ కేసు వేశారు. కరణంకు ఇద్దరు భార్యలు, నలుగురు పిల్లలైతే రెండో భార్య సంగతి, నాలుగో సంతానం సంగతి దాచిపెట్టినట్లు ఆమంచి కోర్టులో కేసు వేశారు. కరణం విషయంలో ఆమంచి చేస్తున్న ఆరోపణలు నిజమే అంటున్నాయి టిడిపి వర్గాలు.

ఇక టెక్కలిలో గెలిచిన టిడిపి అభ్యర్ధి కింజరాపు అచ్చెన్నాయడు మీద కూడా కేసులున్నాయి. ఓబుళాపురంలో మైనింగ్ కార్యాలయంపై జరిగిన దాడిలో అచ్చెన్న 21వ ముద్దాయి. అచ్చెన్న పై అరెస్టు వారెంటు ఇప్పటికీ ఉంది. ఈ కేసును ప్రభుత్వ పరంగా చంద్రబాబునాయడు ఎత్తేసినా కోర్టు ఒప్పుకోలేదు. అంటే ముగ్గురు టిడిపి ఎంఎల్ఏలపై వైసిపి నేతలు వేసిన కేసుల్లో అనర్హత వేటు పడేందుకే అవకాశం ఎక్కువుంది. దాంతో ఎప్పుడేం తీర్పు వస్తుందో అనే టెన్షన్ వాళ్ళల్లో పెరిగిపోతోంది.