త్రీ క్యాపిటల్స్.! బీజేపీని టార్గెట్ చేసిన వైసీపీ.?

విషయం హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు వెళ్ళింది. మూడు రాజధానుల విషయమై తమ అభిప్రాయాన్ని కేంద్రం ఏనాడో స్పష్టం చేసేసింది. ‘రాష్ట్ర రాజధాని అనేది రాష్ట్ర పరిధిలోని అంశం..’ అని తేల్చేసింది కేంద్రం. ఇదే విషయాన్ని హైకోర్టుకి అఫిడవిట్ రూపంలో కూడా కేంద్రం తెలియజేసింది.

అయినాగానీ, మూడు రాజధానుల విషయమై బీజేపీ అధినాయకత్వం స్పష్టమైన వైఖరి చెప్పడంలేదు. ‘రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదు.. అని కేంద్ర ప్రభుత్వం తరఫున బీజేపీ నేతలు మాట్లాడుతున్నారు. అదే సమయంలో, ఏకైక రాజధాని అమరావతి.. అంటూ అదే బీజేపీ నేతలు సెలవిస్తున్నారు. ఇంతలోనే, కర్నూలులో హైకోర్టు అనే వాదనకు కట్టుబడి వున్నామంటున్నారు.

కర్నూలులో హైకోర్టు.. అందుకే కర్నూలుని జ్యుడీషియల్ క్యాపిటల్ అని వైసీపీ చెబుతున్న విషయం విదితమే. బీజేపీ – వైసీపీ మధ్య ఏదన్నా తేడా రాజధాని విషయంలో వుందంటే, అది విశాఖపట్నంకి సంబంధించి మాత్రమే. కర్నూలుకి జ్యుడీషియల్ క్యాపిటల్ తరలించాల్సి వస్తే, హైద్రాబాద్‌కి సైతం ఏదో ఒక రకంగా రాజధాని హోదా దక్కాల్సిందేనని ఉత్తరాంధ్రలో జనం తిరగబడే పరిస్థితి వుంటుంది.

హైకోర్టులో అఫిడవిట్ వేసేసి చేతులు దులుపుకున్నట్టుండదు సుప్రీంకోర్టులో వ్యవహారం. అందుకే, కాస్త ఆలోచించి.. సమయం తీసుకుని ఏపీ ప్రభుత్వం, సర్వోన్నత న్యాయస్థానంలో హైకోర్టు తీర్పుని సవాల్ చేసినట్లుగా భావించాలేమో.

విభజన చట్టం సహా చాలా అంశాలు సుప్రీంకోర్టులో చర్చకు వస్తాయ్.. రాజధాని కేసుకు సంబంధించి. ఒకవేళ ప్రత్యేక హోదా అంశం కూడా చర్చకు వస్తే.? అప్పుడు కేంద్రం, కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీ కూడా ఇరకాటంలో పడొచ్చు.