విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో 72వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. అనంతరం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. మంత్రులు, సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, డీజీపీ గౌతం సవాంగ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
జాతీయ పతాకం ఆవిష్కరించిన అనంతరం గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ప్రసంగిస్తూ… ‘ రాష్ట్రాభివృద్ధికి ప్రభుత్వం స్పష్టమైన అజెండాతో ఉంది. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం ప్రభుత్వం కృషి చేస్తోంది. పేద, బడుగు, బలహీన వర్గాల కోసం వివిధ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది. భిన్నత్వంలో ఏకత్వం అనేది మా సిద్ధాంతం. కొందరు ప్రజల మధ్య శాంతిని చెడగొట్టేందుకు కుట్రలు చేస్తున్నారు.
ఏపీ ప్రభుత్వం అభివృద్ధి వికేంద్రీకరణను కీలకంగా భావిస్తోందని చెప్పారు. ప్రాంతీయ సమానతల కోసం మూడు రాజధానులు అవసరమని గవర్నర్ తెలిపారు. విశాఖను పాలనా రాజధానిగా చేయాలని భావిస్తున్నామని స్పష్టం చేశారు. కర్నూలును న్యాయ రాజధానిగా చేయాలనుకుంటున్నామని చెప్పారు. అమరావతి శాసనరాజధానిగా ఉంటుందని బిశ్వభూషణ్ హరిచందన్ చెప్పారు. రాష్ట్రంలో పేదల సంక్షేమానికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని, ఇళ్ల పథకానికి రూ.28,084 కోట్లు ఖర్చుచేసిందని వివరించారు. రూ.23,535 కోట్ల విలువైన భూములను పేదలకు ఇచ్చినట్లు చెప్పారు. రైతుల భరోసా కింద రూ.13,101 కోట్లు అందించినట్లు తెలిపారు. 2 లక్షల బోర్ల ద్వారా కొత్తగా 5 లక్షల ఎకరాల పంటలను సాగులోకి తెస్తామని ఆయన చెప్పారు. పాడి రైతుల కోసమే అమూల్‌తో తమ ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని తెలిపారు.