ఎన్నికలు సమీపిస్తున్నవేళ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కామెడీ సన్నివేశాలు పెరిగిపోతున్నాయి. సినిమాల్లో కామెడీని, టీవీ షోలలో వచ్చే కామెడీని తలదన్నే స్థాయిలో కొందరు రాజకీయ నాయకులు హాస్యం పండిస్తున్నారు. తనపై విచారణ జరక్కుండా స్టే తెచ్చుకుని… ఇంతకాలం తనపై విచారణ చేయకుండా జగన్ ఏమి చేశారు? తాను ఎవ్వరికీ భయపడేది లేదు.. అని బాబు స్పందించారు. ఇది ఆయన మార్కు కామెడి!
ఇక పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి అవ్వగానే తిరుమల తిరుపతి దేవస్థానంలో… స్వయం ప్రతిపత్తి అంటే ఏమిటో ప్రాక్టికల్ గా చూపిస్తామని కామెంట్స్ చేశారు. దీంతో… నాగబాబులో ఆ కామెడీ టైమింగే మాకిష్టం అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. దీంతో ఈ విషయంలో వెనకబడిపోతున్నామని భావించారో ఏమో కానీ… ఏపీ బీఆరెస్స్ చీఫ్ తోట చంద్రశేఖర్ కూడా తనదైన హాస్యాన్ని పండించే ప్రయత్నం చేశారు. తననుంచి ఇలాంటి ఇంకా వస్తాయని హింట్ ఇచ్చారు.
ఢిల్లీలో బీఆర్ఎస్ భవన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం తోట చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలో తెలుగువారికి సగర్వ వేదికగా బీఆరెస్స్ భవన్ నిలుస్తుందని తెలిపారు. దేశంలో బీఆరెస్స్ తిరుగులేని శక్తిగా అవతరిస్తుందని ఆకాంక్షించారు. అంతవరకూ ఓకే కానీ… ఆ మాత్రం సెల్ఫ్ అట్రిబ్యూషన్ లేకపోతే రాజకీయాల్లో రాణించలేమని భావించి ఆ వ్యాఖ్యలు చేసారని అనుకోవచ్చు. అనంతరం… పంచ్ డైలాగ్ పేల్చారు చంద్రశేఖర్.
వచ్చే ఎన్నికల్లో ఏపీలోని 25 లోక్ సభ, 175 అసెంబ్లీ స్థానాల్లో బీఆరెస్స్ పోటీ చేస్తాదని చంద్రశేఖర్ ప్రకటించారు. అంతేకాదు… వైసీపీ, టీడీపీలకు ధీటుగా తృతీయ రాజకీయ ప్రత్యామ్నాయంగా బీఆరెస్స్ నిలుస్తుందని తెలిపారు. దీంతో కీబోర్డులకు పనిచెబుతున్నారు నెటిజన్లు. ఆలూ లేదు.. చూలూ లేదు.. అనే సామెతలను పోస్ట్ చేస్తున్నారు. ఉట్టికెగరలేనమ్మ ఆకాశానికి ఎగురుతాదంట అంటూ మరొకరు కామెంట్ చేస్తున్నారు.
కారణం… ఏపీలో బీఆరెస్స్ ఉందన్న విషయం తోట చంద్రశేఖర్ మైకులముందుకు వచ్చినప్పుడు తప్ప మిగిలిన సందర్భాల్లో జనం పట్టించుకోరు. ఇప్పటివరకూ అక్కడ ఒక సభ పెట్టిందిలేదు.. ఒక బలమైన నాయకుడు ఆ పార్టీలో చేరిందీ లేదు. 175 నియోజకవర్గాల్లో జెండామోసే ఒక్క కార్యకర్త కూడా లేడాన్నా అతిశయోక్తి కాదేమో! అలాంటి పరిస్థితుల్లో… 175 అసెంబ్లీ, 25పార్లమెంటు స్థానాలకు పోటీచేస్తానని చెప్పడం.. వైసీపీ – టీడీపీలకు ప్రత్యామ్నయంగా మారతామని ప్రకటించడం హాస్యం కాక మరేమిటి? దీంతో… చంద్రశేఖర్ కి కూడా పొలిటికల్ కామెడీలో మంచి మార్కులే వేస్తున్నారు నెటిజన్లు! చంద్రబాబు – నాగబాబు లను మించిపోతున్నారంటూ పదిమార్కుల బోర్డు పైకెత్తుతున్నారు!