ఎంటెక్ చదివిన ఈ అమ్మాయే ఇప్పుడు తెలంగాణ ఎమ్మెల్యే

బానోతు హరిప్రియా నాయక్…. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు నియోజకవర్గం నుంచి  కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ తరపున పోటి చేసిన హరిప్రియా నాయక్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. అసలు ఎవరీ హరిప్రియా.. ఆమె నేపధ్యం ఏమిటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే… 

బానోత్ హరిప్రియా నాయక్ స్వగ్రామం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని దాస్య తండా. ఆమె 2010 లో జెఎన్టీయూ యూనివర్సిటిలో ఎంటెక్ పూర్తి చేశారు. ఆమె హరిసింగ్ నాయక్ ను వివాహం చేసుకున్నారు. చిన్నతనం నుంచే హరిప్రియా నాయక్ కు నాయకత్వ లక్షణాలు ఉండేవని కొత్తగూడెం వాసి తెలిపారు.  సమస్యల పై హరిప్రియా నాయక్ చురుకుగా ప్రశ్నించేవారు. హరిప్రియా నాయక్ తండ్రి గతంలో కాంగ్రెస్ తరపున కొత్తగూడెం సమీపంలోని చుంచుపల్లి గ్రామ సర్పంచ్ గా పోటి చేశారు. వీరి కుటుంబంలో పెద్దగా రాజకీయ నేపథ్యం ఉన్నవారు లేరు. 

హరిప్రియా నాయక్ అనూహ్యంగా 2014 లో ఇల్లెందు టిడిపి టికెట్ దక్కించుకున్నారు. కానీ ఆ ఎన్నికల్లో ఆమె ప్రత్యర్ది కాంగ్రెస్ నుంచి పోటి చేసిన కోరం కనకయ్య  చేతిలో ఓటమిపాలయ్యారు. ఆ ఎన్నికల్లో హరిప్రియ పై 11 వేల ఓట్ల మెజార్టీతో కనకయ్య గెలుపొందారు.

2014 లో ఓటమిపాలైనా ఆమె ప్రజల మధ్య ఉన్నారు.. 2014 నుంచి కూడా ఇల్లెందు రాజకీయాలలో చురుకుగా ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేశారు. తెలంగాణలో టిడిపి అంతరించిపోతుండడంతో ఆమె తన రాజకీయ భవిష్యత్తు కోసం కాంగ్రెస్ లో చేరారు. గత ఏడాది రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీ సమక్షంలో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. రేవంత్ రెడ్డి అనుచరురాలిగా హరిప్రియా నాయక్ కు పేరుంది. 

కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత హరిప్రియ చతురతను గుర్తించిన కాంగ్రెస్ పార్టీ ఆమెను టిపిసిసి మహిళా విభాగం కార్యదర్శిగా నియమించారు. ఆ తర్వాత చత్తీస్ ఘడ్ రాష్ట్ర కాంగ్రెస్ ఏఐసీసీ పరిశీలకురాలుగా నియమించారు. నక్సలైట్ ఏరియాలో శక్తివంతమైన మహిళగా హరిప్రియ పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో భాగంగా ఆమె నక్సల్స్ ఏరియాలో కూడా తిరిగారు. ఓ పక్క తాను పోటి చేస్తున్న ఇల్లెందులో ప్రచారం చేసుకుంటూనే సమయం దొరికినప్పడల్లా ఛత్తీస్ ఘడ్ లో పర్యటించి ప్రచారం చేశారు. పార్టీ అప్పగించిన బాధ్యతలను నిర్వర్తించారు.

2014లో హరిప్రియా పై కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన కోరం కనకయ్య 11 వేల ఓట్లతో గెలవగా, ఇప్పుడు అదే కనకయ్య పై హరిప్రియ 2,600 ఓట్ల ఆధిక్యంతో గెలవడం విశేషం. గిరిజన తెగల వివాదం తీవ్రస్థాయిలో ఉన్న సమయంలో హరిప్రియకు లంబాడాలు సంపూర్ణ మద్దతు ఇవ్వడంతో సత్తా చాటారు. లంబాడాలకు, గోండు తెగలకు వివాదాలు నడిచినప్పుడు లంబాడాల పక్షాన నిలబడి తమ రిజర్వేషన్ల గురించి తన వాయిస్ ను వినిపించారు. అప్పుడే ఆమె నియోజకవర్గ ప్రజల అభిమానాన్ని సంపాదించారని పలువురు నేతలు అన్నారు.

మొదటి సారి ఎమ్మెల్యేగా గెలిచిన హరిప్రియ నాయక్ నియోజకవర్గ ప్రజలకు సేవ చేసే అదృష్టం దక్కిందని ఆనందం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో చాలా సమస్యలున్నాయని వాటన్నింటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. హరిప్రియా నాయక్ విద్యావంతురాలు కావడం కూడా ఆమె విజయానికి తోడ్పడిందని చెప్పవచ్చు.