ఈసారి వైసీపీని గెలిపించాల్సింది ఆ పార్టీ ఎమ్మెల్యేలే.!

‘నేను బటన్ నొక్కగలను.. అంతకు మించి నేనేమీ చేయలేను. బటన్ నొక్కి సంక్షేమ పథకాలకు నిధుల్ని విడుదల చేస్తున్నాం. అవి నేరుగా ప్రజల వద్దకు వెళుతున్నాయ్. మనం చేస్తున్న మంచి పనిని జనంలోకి తీసుకెళ్ళాల్సింది ఎమ్మెల్యేలే.. అది కూడా మీరు సక్రమంగా చేయకపోతే కష్టం..’ అంటూ పదే పదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘వర్క్ షాప్’ పెట్టి మరీ, పార్టీకి చెందిన ఎమ్మెల్యేలకు క్లాసులు పీకుతున్నారు.

ఈ విషయమై వైసీపీలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. గతంలో అయితే పరిస్థితి వేరు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అంటే ఓ పేరు కాదు, బ్రాండ్.. అన్నట్లుండేది. ‘జగనన్న’ పేరుతో అనేక సంక్షేమ పథకాలు ఇప్పుడు అమలువుతున్నా, ఆ ‘జగనన్న’ బ్రాండ్‌కి ఒకింత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది.

ప్రజలు సంక్షేమ ఫలాల్ని అందుకుంటారు.. ఎవరు అధికారంలో వున్నా. అవి నాయకుల జేబుల్లోంచి ఇచ్చినవి కావని ప్రజలకూ తెలుసు. అప్పట్లో చంద్రన్న కానుక, ఇప్పుడు జగనన్న కానుక.. రేప్పొద్దున్న పవన్ కళ్యాణ్ అధికార పీఠమెక్కితే పవనన్న కానుక.. ఏదీ ఆగదు, అంతకు మించే వస్తాయ్.. అని జనంలో బలమైన టాక్ నడుస్తోంది.

ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా విషయాన్ని పూర్తిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అవగతం చేసుకున్నారు. ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో పోజులు కొట్టడం మినహా పని చేయడంలేదన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అందుతున్న రిపోర్ట్. అలాగని, వారిని గట్టిగా మందలించలేరు.

మందలిస్తే, పార్టీ ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది.
గడప గడపకూ మన ప్రభుత్వం.. పేరుతో ఎమ్మెల్యేలు జనం వద్దకు వెళుతున్నా, అక్కడా ఎమ్మెల్యేలు దురుసుగానే ప్రవర్తిస్తున్నారు.. వారి పట్ల ప్రజలూ అంతే తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇవన్నీ వైసీపీకి నెగెటివ్ సంకేతాలే.విపక్షాలు బలహీనంగా వున్నాయని వైఎస్ జగన్ అనుకుంటే సరిపోదు.

ఎందుకంటే, అంతిమంగా ప్రజలే న్యాయ నిర్ణేతలు. అందుకే, ఎమ్మెల్యేలే పార్టీని గెలిపించాలన్న మాట వైసీపీ అధినాయకుడి నుంచి వస్తోంది. ప్చ్.. ఆ ఎమ్మెల్యేలెవరికీ వాస్తవం బోధపడటంలేదు.