నిమ్మగడ్డ రమేష్ కుమార్. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి. ఆయన కెరీర్ లో ఒక్క మచ్చ లేదు. అయితే , నిమ్మగడ్డ రమేష్ కుమార్ వెనక అదృశ్య శక్తి ఉంది అంటూ మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తాజాగా రాసిన లేఖలో ఆరోపించిన నేపధ్యం నుంచి చూసినపుడు కూడా కొత్త ఆలోచనలు కలుగుతున్నాయి. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గత ఏడాది మార్చి నెల మధ్యలో హఠాత్తుగా ఎన్నికలను వాయిదా వేశారు. ప్రభుత్వంతో చెప్పకుండా ఆయన ఎన్నికలను వాయిదా వేయడం తప్పు అని సుప్రీం కోర్టు కూడా వ్యాఖ్యానించింది.
ఆ సమయంలో సీఎం జగన్ కొంత సహనంతో వ్యవహరించి ఉంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేరు ఇప్పుడు మాదిరిలా ఇంతలా వినిపించి ఉండే అవకాశం లేదు. ఇక మరో వైపు చూస్తే నిమ్మగడ్డను ఆ పదవి నుంచి తప్పించాలని చూడడం కూడా మరో తప్పు. ఆ మీదట ఎన్నికల సంఘాన్ని రాజ్యాంగ సంస్థగా మరచి నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీద గుడ్డి వ్యతిరేకతతో ఆయనను ఒక వ్యక్తిగానే చూడడం మరో పెద్ద తప్పు. ఇలా తప్పుల మీద తప్పులు జగన్ కానీ ఆయన మంత్రులు కానీ చేయడంతోనే నిమ్మగడ్డ రమేష్ కుమార్ హీరో అయ్యారని చెప్పాలి.
నిమ్మగడ్డ రమేష్ కుమార్ వెనక అదృశ్య శక్తి ఉందని ముద్రగడ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక వైసీపీ నేతలు అయితే డైరెక్టుగా చంద్రబాబు ఉన్నారని అనేస్తున్నారు. మరి అదే నిజమైతే నిమ్మగడ్డ రమేష్ కుమార్ వంటి నీటుగా పనిచేసుకుని పోయే ఒక అధికారిని ముందు పెట్టి రాజకీయం ఆడించారా అన్న చర్చ కూడా ఉంది. అలా చూసుకుంటే నిమ్మగడ్డ హీరో కావడానికి బాబు వేసిన ఎత్తులు కూడా కారణమే అన్న మాట వినిపిస్తోంది. రాజ్యాంగంతో ఎవరైనా జాగ్రత్తగా ఉండాలి. వ్యవస్థలు అన్నీ దానికి లోబడి పనిచేయాలి. నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో ఇపుడు ఎవరైనా అదే తెలుసుకోవాలి. ఇక్కడ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నెగ్గినా, జగన్ ప్రభుత్వం నెగ్గినా కూడా అంతిమంగా గెలిచేది మాత్రం రాజ్యాంగం, దాని స్పూర్తి మాత్రమే. రాజ్యాంగానికి ఎదురుగా ఎవరు వెళ్ళినా ఇలాంటి తీర్పులే వస్తాయి.మొత్తానికి చూస్తే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని హీరోను చేయడంలో అందరి పాత్ర ఉందని చెప్పాలి.