నేతి బీరకాయలో నెయ్యి ఎంతుంటుందో చంద్రబాబునాయుడు పాలనలో ప్రజాస్వామ్యం అంతే ఉంటుంది. ఈరోజు ఉదయం గుంటూరు జిల్లా నరసరావుపేటలో వైసిపి సమన్వయకర్త కాసు మహేష్ రెడ్డి అరెస్టు చేసిన ఘటనే చంద్రబాబు మార్కు ప్రజాస్వామ్యానికి తాజా ఉదాహరణ. ప్రతీ రోజు పొద్దున లేచిన దగ్గర నుండి చంద్రబాబు ప్రజాస్వామ్యం గురించే ఉపన్యాసాలు దంచేస్తుంటారు. బిజెపియేతర పార్టీలను కలిపేస్తానని దేశమంతటా తిరుగుతున్న చంద్రబాబు ముఖ్యంగా దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ఒకటే ఊదర గొడుతున్న విషయం తెలిసిందే.
దేశంలో నరేంద్రమోడి ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్నాడని ఆరోపిస్తున్న చంద్రబాబు రాష్ట్రంలో ఏం చేస్తున్నారు ? ఏపిలో ప్రజాస్వామ్యం ఉందంటే అది కేవలం తెలుగుదేశంపార్టీ నేతలకు మాత్రమే అన్న విషయం అందరికీ తెలుసు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన ఉద్యమాలను అణిచివేసిన చంద్రబాబు కూడా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారంటే ఆశ్చర్యంగా ఉంది. ప్రత్యేకహోదా కోసం వైసిపి ఆధ్వర్యంలో జరిగిన ఉద్యమాలను చంద్రబాబు ఎలా అణిచివేశారో అందరూ చూసిందే.
తాజాగా నరసరావుపేటలో కాసు మహేష్ రెడ్డిని హౌస్ అరెస్టు చేశారు. ఎందుకంటే, పెంచిన ఇంటి పన్నులకు నిరసనగా ఆందోళన చేయాలని వైసిపి నిర్ణయించటమే కారణం. పెంచిన ఇంటి పన్నులను భరించలేకపోతున్నట్లు అక్కడి స్ధానికులు మండిపడుతున్నారు. అందుకే వైసిపి ఆందోళనకు పిలుపిచ్చింది. దానికే కాసు మహేష్ ను పోలీసులు హౌస్ అరెస్టు చేయటమేంటో అర్ధం కావటం లేదు. కాసు ఇంటిచుట్టూ పోలీసులు భారీ ఎత్తున మోహరించటం ఏ విధమైన ప్రజాస్వామ్యానికి చిహ్నమో చంద్రబాబే చెప్పాలి. చంద్రబాబు చెబుతున్న ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్య విలువలు కేవలం మాటలకే పరిమితమని అర్ధమైపోయింది.