ఇప్పటం ఇళ్ల కూల్చివేత.. పవన్ కళ్యాణ్ అతికి గ్రామస్తులు బలయ్యారా?

ఈ మధ్య కాలంలో ఏపీలో ఎక్కువగా వినిపించిన గ్రామాలలో ఇప్పటం గ్రామం ఒకటి. పవన్ సభకు స్థలం ఇవ్వడం ద్వారా ఈ గ్రామం వార్తల్లో నిలిచింది. అయితే రోడ్డు విస్తరణలో భాగంగా జగన్ సర్కార్ ఇప్పటం గ్రామంలో ఇళ్లను కూల్చివేయడం హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. జనసేన అధినేత పవన్ వాళ్లకు విరాళాలను ప్రకటించడం కూడా జరిగింది. అయితే ఇళ్ల కూల్చివేత సమయంలో కొందరు ప్రభుత్వం నోటీసులు ఇవ్వలేదని కోర్టును ఆశ్రయించారు.

అయితే ప్రభుత్వం వాళ్లకు నోటీసులు అందించినట్టు ఆధారాలతో సహా ప్రూవ్ చేసిన నేపథ్యంలో హైకోర్టు కోర్టును ఆశ్రయించిన రైతులకు లక్ష రూపాయల చొప్పున జరిమానా విధించి షాకిచ్చింది. హైకోర్టు రైతులకు ఊహించని మొత్తం జరిమానా విధించడం హాట్ టాపిక్ అవుతోంది. అయితే రైతులు కోర్టును ఆశ్రయించడం వెనుక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉన్నారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

అయితే పవన్ కళ్యాణ్ అతికి గ్రామస్తులు బలయ్యారని మరి కొందరు కామెంట్లు చేస్తుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. జనసేన అండగా నిలబడినా రైతులకు భారీ షాక్ తగలడం ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది. ఇప్పటం గ్రామస్తులు జరిమానా విషయంలో ఏం చేస్తారో చూడాలి. పవన్ కళ్యాణ్ తన రాజకీయాల కోసం ఇప్పటం గ్రామస్తులను ఉపయోగించుకుంటున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఇప్పటం గ్రామస్తులతో పార్టీలు రాజకీయాలు చేయడం వల్ల ప్రజలు సైతం నిత్య జీవితంలో ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉందని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ కామెంట్ల గురించి పవన్ ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.