నవ్వుకుంటున్నారు పవన్ కళ్యాణ్.. నిన్ను చూసి.!

ఉద్దేశ్యం ఏదైనా, ఒక్కోసారి మాట చాలా తేడా కొట్టేస్తుంటుంది. అదేంటో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట పదే పదే తేడా కొట్టేస్తూ వుంటుంది. అదే ఆయన ప్రత్యేకత. ముందూ వెనుకా ఆలోచించరు మాట్లాడేటప్పుడు. అదే ఆయనకు అతి పెద్ద సమస్య. ఆయన మాటే ఆయనకి శతృవు.

ఇక్కడో మాట గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ‘నా ముందు జగన్ చాలా చాలా తక్కువ.. ఆయనతో నాకు పోటీ ఏంటి.?’ అంటూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ‘జలగ’గా అభివర్ణించారు జనసేన అధినేత, తణకు జనసేన పార్టీ ముఖ్య నేతల సమావేశంలో.

‘వారాహి విజయ యాత్ర’లో భాగంగా తణుకులో పార్టీ ముఖ్య నేతలతో సమావేశమైన పవన్ కళ్యాణ్, పార్టీలో కొత్త ఉత్సాహం నింపేందుకు మరింత ఉత్సాహంగా ఏవేవో మాట్లాడేస్తున్నారు. అప్పటికి ఆ మాటలు పార్టీ కార్యకర్తల్ని ఉత్సాహపరుస్తున్న మాట వాస్తవం. కానీ, ఆ తర్వాత.? జనసైనికుల సంగతి తర్వాత.. జనం ఏమనుకుంటున్నారు.?

2019 ఎన్నికల్లో వైసీపీకి 151 అసెంబ్లీ సీట్లు దక్కాయి. వైసీపీ 22 ఎంపీ స్థానాల్ని గెలుచుకుంది. మరి, జనసేన పరిస్థితేంటి.? ఒక్క అసెంబ్లీ సీటు గెలుచుకుంది.. ఎంపీల సంఖ్య సున్నా. మరి, ఎవరు తక్కువ.? ఎవరు ఎక్కువ.? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. పవన్ కళ్యాణ్ సంగతో.!

సరే, రాజకీయాల్లో గెలుపోటములు సహజం. ఓడినోడు తప్పుడు మనిషి కాకపోవచ్చు.. గెలిచినోడు గొప్పోడు కాకపోవచ్చు. కానీ, గెలుపుకి కొంత గౌరవం ఇచ్చి తీరాలి కదా. అంతకు ముందు వైఎస్ జగన్ ఎమ్మెల్యే.. అంతకన్నా ముందు ఎంపీ. ఇన్ని ప్రత్యేకతలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముందున్నాయ్ కదా.!

జగన్ స్థాపించిన వైసీపీ చేతిలోనే జనసేన ఓడింది కదా.! నవ్వుకుంటున్నారు పవన్ కళ్యాణ్ మీ మాటల్ని చూసి.!