వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో నోరేసుకుని పడిపోయే నేతలు చాలామందే వున్నారు. బూతులు మాట్లడటంలో అస్సలేమాత్రం మొహమాటపడని నాయకులూ వున్నారు. మంత్రలుగానూ, ఇతర కీలక పదవుల్లోనూ చాలామంది పవర్‌ఫుల్ లీడర్స్ వున్నారు. కానీ, ఆ పవర్ అంతా మీడియా మైకులు కనిపించినప్పుడే తప్ప, తెరవెనుక వ్యూహాత్మక వ్యవహారాలు నడపడంలో కాదని, మేనేజ్‌మెంట్ స్కిల్స్ ఒక్కరికీ లేవని తేలిపోయింది. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్ళు పూర్తవుతోంది. ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా కరోనా కాలంలోనూ సంక్షేమ పథకాల క్యాలెండర్ పక్కగా అమలవుతోన్న మాట వాస్తవం. కానీ, ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత నానాటికీ పెరిగిపోతోంది. ఎందుకిలా.? దానిక్కారణం అధికార పార్టీ నేతలేనన్న భావన రాజకీయ వర్గాల్లోనే కాదు, వైసీపీలోనూ వినిపిస్తోంది. ఎప్పటినుంచో వైసీపీలో వున్న నేతల సంగతి పక్కన పెడితే, ఇతర పార్టీల నుంచి వైసీపీలోకి వచ్చిన నేతల కారణంగా పార్టీ భ్రష్టుపట్టిపోతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో, వైసీపీ నేతల డొల్లతనం బయటపడుతోంది. ఇలాంటి సందర్భంలో ప్రభుత్వ పెద్దలు ఎదురుదాడి చేయడం అనేది అధికార పార్టీకి నష్టమే చేస్తుంది. మంత్రులే కాదు, ముఖ్యమంత్రి కూడా నెపాన్ని విపక్షాలపై నెట్టేస్తున్నారు. ఎప్పుడూ ప్రత్యర్థులపై ఆరోపణలు చేయడమేనా.? పని చేసేదేమన్నా వుందా.? అని జనం ప్రశ్నించే పరిస్థితి వచ్చేసింది. టీడీపీ వల్లనే రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని పలువురు మంత్రులే కాదు, ముఖ్యమంత్రి కూడా చెబుతున్నారు. అంటే, టీడీపీని నిలువరించలేని అసమర్థత వైసీపీ ప్రభుత్వంలో వుందా.? అన్న ప్రశ్న రాకుండా ఎందుకు వుంటోంది. వాళ్ళు చేస్తున్నదే నిజమైతే, దాన్ని ఉపేక్షిస్తున్న మీరు ఇంకా పెద్ద తప్పిదం చేస్తున్నట్లే కదా.. అన్నది జనం సంధిస్తున్న ప్రశ్న. పార్టీ – ప్రభుత్వం.. రెండూ భిన్నమైన వ్యవహారాలు. ప్రభుత్వాన్ని నడుపుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి పార్టీ పరంగా ఎలాంటి సమస్యలు తలెత్తినా సహాయ సహకారాలు అందించే వ్యక్తులు అవసరం. కానీ, ఎవరికి వారు మీడియాలో చోటు కోసం తాపత్రయ పడుతున్నారు తప్ప, పార్టీకి జరుగుతున్న నష్టం గురించి ఆలోచించడంలేదు. పలువురు మంత్రలు, పార్టీ కోటరీకి చెందిన కీలక వ్యక్తల వల్లనే అటు పార్టీకీ, ఇటు ప్రభుత్వానికీ చెడ్డపేరు వస్తోందంటూ కింది స్థాయిలో కార్యకర్తలు తాజా పరిణామాల పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.