తెలంగాణ రాజకీయాల్లో వైఎస్ షర్మిల పాత్ర ఎంత.?

మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఏం చేయబోతున్నారన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. ఇటీవల వైఎస్ షర్మిల, తెలంగాణలో ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరయ్యారు. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్ వేడుక అది. ఆ కార్యక్రమంలో వైఎస్ షర్మిల హంగామా చేశారు. కాదు కాదు ఆమె అనుచరులు హంగామా చేశారు.

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత. ఆ పార్టీ నుంచే ఆయన ఎంపీగా గెలిచారుగానీ, ఆ తర్వాత ఆయన తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. తెలంగాణ రాష్ట్ర సమితిలో ఇమడలేకపోతున్న పొంగులేటి, తన రాజకీయ బలాన్ని చాటుకునే క్రమంలో, కుమార్తె వివాహ రిసెప్షన్‌ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారన్న వాదనలు లేకపోలేదు.

ఇక, ఈ కార్యక్రమంలో వైఎస్ షర్మిల అనుచరుల హంగామా చూసి, ‘ఈ స్థాయి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్‌కి కూడా లేదే..’ అంటూ కొందరు ఆశ్చర్యపోయిన మాట వాస్తవం. ‘ఇదే ఊపులో మునుగోడు ఉప ఎన్నికలో షర్మిల తమ పార్టీ అభ్యర్థిని నిలబెడితే మంచిది..’ అన్న చర్చ సర్వత్రా జరుగుతోంది.

‘తెలంగాణలో అధికారంలోకి వస్తాం..’ అంటున్నారు వైఎస్ షర్మిల. అదంత తేలికైన వ్యవహారం కాదు. ఎందుకంటే, ఆమె రాజకీయ ప్రయాణం తెలంగాణలో ఈ మధ్యనే ప్రారంభమయ్యింది. వచ్చే ఎన్నికల్లో వైఎస్ షర్మిల పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందో తెలియదు. కానీ, మునుగోడు ఉప ఎన్నికని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే షర్మిలకు రాజకీయంగా అది కొంత ప్లస్ అవుతుంది.

కానీ, అంత రిస్క్ ఆమె చేయలేరన్నది సర్వత్రా వినిపిస్తోన్న వాదన. పోటీ చేయకపోతే మాత్రం ప్రస్తుతానికి తెలంగాణ రాజకీయాల్లో షర్మిల పాత్ర ‘శూన్యం’ అనుకోవాల్సి వస్తుంది.