పవన్ కళ్యాణ్ ‘వారాహి’ వెనుక వున్నదెవరు.?

మొన్నామధ్యన జనసేన అధినేత పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ కోసం కొన్ని స్కార్పియో వాహనాల్ని కొనుగోలు చేశారు. అయితే, అవి టీడీపీ స్పాన్సర్ చేసిన వాహనాలంటూ అధికార వైసీపీ ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే.

మంత్రి రోజా ఈ ఆరోపణల్లో కీలక పాత్ర పోషించారు. మరి, మంత్రి రోజా కొనుగోలు చేసిన ఖరీదైన బెంజ్ వాహనం సంగతేంటి.? మంత్రి పదవి రాగానే, కుమారుడి కోసం ఆ వాహనాన్ని ఎలా తెచ్చారు.? అన్న ప్రశ్నలు తెరపైకొచ్చాయి.

‘నేను సినిమా హీరోయిన్‌ని.. నాకు కార్లు కొనుగోలు చేయడం పెద్ద లెక్కా..’ అంటూ రోజా చెప్పుకొచ్చారు. మరి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంకెంత గొప్ప.? ఆయన ఇంకెంత ఖరీదైన వాహనాలు కొనుగోలు చేయగలరు.? అని జనసేన పార్టీ కౌంటర్ ఎటాక్ చేసింది.

రాజకీయాల్లో ఇవన్నీ మామూలే. తాజాగా జనసేనాని పరిచయం చేసిన ‘వారాహి’ కూడా విమర్శలకు కేంద్ర బిందువు అవుతోంది. ‘వారాహి’ అనగానే, ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ గుర్తుకొస్తుంది. ఆ బ్యానర్ నిర్వాహకుల్లో ఒకరైన సాయి కొర్రపాటి, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకి అత్యంత సన్నిహితుడు.

ఆయనే జనసేనాని ఎన్నికల యుద్ధ శకటానికి స్పాన్సర్ చేశారనీ, ఆ రకంగా చూస్తే ఇది టీడీపీ స్పాన్సర్డ్ వాహనమనీ వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ప్చ్.. వీటికి కౌంటర్ ఎటాక్ ఇవ్వడానికి జనసేన ఎలాంటి ఆలోచనలు చేయాలో ఏమో.!