చావుకు అందిన పరిహారంలోనూ వాటా అడిగిన మంత్రి!

అతను ఇంటి బాధ్యతలు మోస్తున్న కుమారుడు.. ఇంటి ఖర్చులు, అవసరాలు తీర్చే క్రమంలో ఓ హోటల్ లో పనికి వెళ్ళాడు. తీరా అక్కడ పనిలో భాగంగా డ్రైనేజిలో పడి చనిపోయాడు. అలా ఇంటికి పెద్ద దిక్కు అయిన కోల్పోయిన ఆ అవ్వకు ప్రభుత్వం రూ. 5 లక్షల ఆర్ధిక సాయం ప్రకటించింది. దిక్కు మొక్కు లేని ఆ కుటుంబానికి ఆ డబ్బు సహాయంగా పనిచేస్తుందని అనుకుంటే.. అప్పటికే ఆ డబ్బుపై రాబందులు కన్నేశాయి. మున్సిపల్ చైర్మన్ భర్త ఆ డబ్బులో సగం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై మంత్రి అంబటి రాంబాబును సంప్రదించినా అక్కడ అదే సమాధానం.

కుటుంబ పోషణలో భాగంగా..
గుంటూరు దగ్గర దాసరిపాలెంలో నివసించే తురక పర్లయ్య కుటుంబం సంవత్సరంన్నర ముందు పొట్టకూటి కోసం సత్తెనపల్లి వలస వచ్చారు. అక్కడ రోడ్డు పక్కనే చిన్న గుడిసె వేసుకుని జీవనం కొనసాగిస్తున్నారు. పర్లయ్య, గంగమ్మలకు అనిల్‌ (17), సమ్మక్క (14) పిల్లలు. పర్షయ్య ఆరోగ్యం బాగాలేక ఇంటి వద్దే ఉంటున్నాడు. గంగమ్మ ఫ్రైవేటు పాఠశాలలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్నారు. కుటుంబ పోషణ కోసం కుమారుడు అనిల్ కూడా పని చేస్తూ ఉండేవాడు. ఆగస్టు 20న రాత్రి పట్టణంలోని వినాయక హోటల్‌లో డ్రైనేజీ పనికి వెళ్లిన అనిల్‌.. గుంతలో మురుగు తీస్తూ చనిపోయాడు.

అనిల్ చనిపోవడంతో కుటుంబం దిక్కు కోల్పోయింది. దీనితో 20 రోజుల క్రితం వారికి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ. 5 లక్షల చెక్కు మంజూరైంది. అయితే సమయానికి చెక్కు అందించి సహాయంగా నిలవాల్సిన ప్రజా ప్రతినిధులే అడ్డు తగిలారు. రూ.2.50 లక్షలు ఇస్తేనే చెక్కు ఇస్తామని మున్సిపల్ చైర్‌పర్సన్‌ భర్త, మంత్రి అంబటి రాంబాబు వేధిస్తున్నారని సదరు బాధితులు వాపోతున్నారు.

వచ్చిన డబ్బుతో కూతురు పెళ్లి చేయాలని భావించిన కుటుంబానికి నిరాశ మిగలడంతో పోలీసులను ఆశ్రయించారు. పోలీసు స్టేషన్లో సీఐ కూడా వాళ్ళకే వంత పాడారని బాధితులు తెలిపారు. తమకు ఎవ్వరూ అండగా నిలవక పోగా నాయకులు బెదిరిస్తున్నారని, ప్రభుత్వ పథకాలు అందకుండా చేస్తామని, కేసులు పెడతామని భయపెడుతున్నారని అన్నారు. ఇక తమకు చావే శరణ్యం అంటూ బాధితులు వాపోయారు. కనీసం పై అధికారులు స్పందించి తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు.