ఏపీలో తొలివిడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది. 168 మండలాల్లోని 3,249 గ్రామ పంచాయతీలు, 32,504 వార్డు మెంబర్ల ఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ నేటి సాయంత్రం ముగిసింది. సోమవారం ఉదయం 8 గంటల నుంచే ఎన్నికల నామినేషన్లు పరిశీలించనున్నారు. ఫిబ్రవరి 3న నామినేషన్ల అభ్యంతరాలపై తుది నిర్ణయం తీసుకుంటారు. ఫిబ్రవరి 4వ తేదీ 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరించుకునేందుకు గడువు ఇచ్చారు. ఫిబ్రవరి 9 ఉదయం 9 నుంచి 3.30 గంటల వరకు పోలింగ్ వెంటనే ఓట్ల లెక్కింపు చేపట్టి, ఫలితాలను ప్రకటిస్తారు. సర్పంచ్, వార్డు మెంబర్ల ఫలితాలు రాగానే ఉప సర్పంచ్ ఎన్నికను పూర్తి చేస్తారు.
పంచాయతీ ఎన్నికల తొలివిడత నామినేషన్ల ప్రక్రియలో పెద్దగా హింస చోటు చేసుకోలేదనే చెప్పాలి. అయితే అధికారపార్టీ నేతల బెదరింపులు, అరాచకాలకు మాత్రం అడ్డుకట్ట పడలేదు. ఏకగ్రీవాలు చేయాలంటూ వైసీపీ అధినేత మాటగా మంత్రులు బహిరంగంగా ప్రకటించడంతో అధికారపార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు షాడోలుగా గ్రామ పంచాయతీ నామినేషన్ల ప్రక్రియలో చక్రం తిప్పారు. దీంతో అనేక ప్రాంతాల్లో గొడవలు చోటు చేసుకున్నాయి. కొన్ని గ్రామాల్లో టీడీపీ బలపరిచిన అభ్యర్థులను కిడ్నాప్ చేశారు. ఎన్నికల కమిషన్ సీరియస్‌గా తీసుకోవడంతో వైసీపీ నేతలు కొంత జాగ్రత్త పడ్డారనే చెప్పవచ్చు.
మొత్తంగా 319 సర్పంచ్ స్థానాలకు 1772 మంది, 2902 వార్డు మెంబర్ స్థానాలకు 6382 మంది బరిలో దిగనున్నారు. చివరి రోజు ఆదివారం సర్పంచ్ స్థానాలకు 879 మంది, వార్డు స్థానాలకు 4345 మంది నామినేషన్ దాఖలు చేశారు. ఆదివారం వివిధ ప్రాంతాల్లో అలజడి చోటుచేసుకుంది.