జనసేనతో పొత్తుల్లేవ్.. అంటూ, టీడీపీ శ్రేణులకు సంకేతాలు పంపించారు ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు.! దానికి అనుగుణంగానే తెలుగు తమ్ముళ్ళు రెచ్చిపోయారు. జనసేన పార్టీని తూలనాడారు.. తూలనాడుతూనే వున్నారు.! కానీ, ఇంతలోనే సీన్ మారింది. ‘పొత్తులు ఖచ్చితంగా వుంటాయి. జనసేనతోపాటు, బీజేపీతోనూ పొత్తులపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఎన్నికల సమయంలోనే ఆ పొత్తుల చర్చలు జరుగుతాయి..’ అని సెలవిచ్చారు టీడీపీ అధినేత.
స్వర్గీయ ఎన్టీయార్ జ్ఞాపకార్ధం విడుదల చేసిన 100 రూపాయల ప్రత్యేక నాణెం ఆవిష్కరణ సందర్భంగా ఢిల్లీకి వెళ్ళిన చంద్రబాబు, ఢిల్లీలో పలువురు బీజేపీ పెద్దలతో మంతనాలు జరిపారు.. అదీ అనధికారికంగా.! ముందస్తు ఎన్నికలు రాష్ట్రంలో జరగబోతున్నాయని చంద్రబాబు వ్యాఖ్యానించడం గమనార్హం.
పొత్తులపైనా చూచాయిగా స్పష్టత ఇచ్చేశారు. బీజేపీ, జనసేనతో పొత్తులుంటాయని నేరుగా చెప్పలేదుగానీ, ఆ దిశగా ఆయన సంకేతాలైతే ఇచ్చేశారు. దాంతో, తెలుగు తమ్ముళ్ళు, రివర్స్ గేర్ వేసేశారు. జనసేన, బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళతామంటూ తెలుగు తమ్ముళ్ళు సెలవిస్తున్నారు.
అంతే కాదు, వైఎస్ జగన్ బెయిల్ రద్దవుతుందనీ, జగన్ జైలుకు వెళతారనీ, తెలుగు తమ్ముళ్ళు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. సెప్టెంబర్ నెలలో రాష్ట్రంలో కీలక పరిణామాలు చోటు చేసుకోబుతున్నాయన్నది తెలుగు తమ్ముళ్ళు సోషల్ మీడియా వేదికగా చేస్తున్న ప్రచారం.
అలా ఎలా తెలుగు తమ్ముళ్ళు ప్లేటు ఫిరాయించేయగలుగుతున్నారు.? దటీజ్ తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు ఎలా చెబితే, అలా టీడీపీ అను‘కుల’ మీడియాతో సహా, టీడీపీ సోషల్ మీడియా విభాగం మారిపోతుంటుందంతే.