సంక్రాంత్రి పండుగ సందర్భంగా పట్నంలో ఉన్న వాళ్లంతా పల్లెబాట పట్టారు. దీంతో రైళ్లు, బస్సులు, ప్రైవేటు వాహనాలు కిక్కిరిసిపోతున్నాయి. చాలా మంది కార్లలో ఆంధ్రాకు వెళ్తుండడంతో అన్ని రోడ్లు రద్దీగా ఉన్నాయి. కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జాం అవుతుంది. టోల్ గేట్ల దగ్గర దాదాపు 10 కిలోమీటర్ల దూరం ట్రాఫిక్ జాం అవుతుంది.
టోల్ గేట్ల దగ్గర పరిస్థితిని ఆరా తీసిన సీఎం కేసీఆర్ శనివారం సాయంత్రం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కేజోషితో ప్రగతి భవన్ లో సమావేశమయ్యారు. రద్దీ దృష్ట్యా జనవరి 13, 16 వ తేదిలలో టోల్ ఫీజు వసూలు చేయవద్దని నిర్ణయించి ఆదేశాలు జారీ చేశారు. కానీ టోల్ సిబ్బంది మాత్రం యధేచ్ఛగా టోల్ ఫీజు వసూలు చేస్తున్నారు. దీంతో ప్రజలు ప్రభుత్వం ఆదేశించిన వసూలు చేయడమేంటని సిబ్బందితో గొడవపడుతున్నారు. దీంతో భారీగా ట్రాఫిక్ జాం అవుతోంది.
టోల్ సిబ్బంది మాత్రం తమకు రాష్ట్రప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదని మాకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తేనే అప్పుడు నిలిపేస్తామంటున్నారు. నేషనల్ హైవేస్ అథారిటి నుంచి ఆదేశాలు రావల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. దీంతో పంతంగి, కొర్లపహాడ్, నందిగామ, జడ్చర్ల, అవుటర్ రింగ్ రోడ్డు టోల్ గేట్ల వద్ద ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం వెంటనే స్పందించి తక్షణమే ఆదేశాలు ఇవ్వాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు.