Bheemla Nayak : సంక్రాంతి సినిమాల కోసం తెలుగు సినీ పరిశ్రమ చాలా ఆశగా ఎదురుచూస్తోంది. రెండు పాన్ ఇండియా రిలీజ్‌లున్నాయి ఈ సంక్రాంతికి. అందులో ఒకటి రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ కాగా, ఇంకొకటి ‘రాధేశ్యామ్. దేశం మొత్తం ఈ రెండు సినిమాల విడుదలల కోసం ఎదురుచూస్తున్నమాట వాస్తవం.
కానీ, ఢిల్లీలో సినిమా థియేటర్లపై ఆంక్షలు షురూ అయ్యాయి. థియేటర్లు మూతపడ్డాయి. మహారాష్ట్రలోనూ రేపో మాపో థియేటర్ల మూతపై ఆదేశాలు రావొచ్చనే ప్రచారం జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల సంగతేంటి.? అన్నది ముందు ముందు తేలుతుంది.
ఇదిలా వుంటే, సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న ‘భీమ్లానాయక్’ నుంచి ఓ సంచలన ప్రకటన రాబోతోందంటూ సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. సినీ పెద్దలు కొందరు బతిమాలడంతో, ‘భీమ్లానాయక్’ నిర్మాతలు సినిమా విడుదలను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది.
ఇప్పుడేమో, సంక్రాంతి రిలీజులు (ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్) సైతం అయోమయంలో పడ్డాయి. దాంతో, ఓటీటీ వైపు ‘భీమ్లానాయక్’ చూస్తుందా.? లేదంటే, తెగించి సంక్రాంతి రేసులోకి వస్తుందా.? అన్న విషయమై సినీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.
ఇదిలా వుంటే, సినిమా రంగానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఎదురవుతున్న ఇబ్బందులపై గళం విప్పాలంటూ జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ మీద సినీ పరిశ్రమ నుంచి ఒత్తిడి ఎదురవుతోందట. గతంలో ఇలాగే వచ్చిన ఒత్తిడి వల్ల పవన్ పెదవి విప్పితే, పవన్‌ని అప్పట్లో ముందుకు తోసిన సినీ ప్రముఖులు, ఆ తర్వాత పక్కకి తప్పుకున్న సంగతి తెలిసిందే.