చంద్రబాబులో పెరిగిపోతున్న టెన్షన్

చూడబోతే టిడిపి అధినేత చంద్రబాబునాయుడుకు నిద్రకూడా సరిగా పడతున్నట్లు లేదు. టిడిపి ప్రజాప్రతినిధులు కుదిరితే వైసిపిలోకో లేకపోతే బిజెపిలోకో వెళ్ళిపోతారనే ప్రచారం రోజురోజుకు పెరిగిపోతోంది. టిడిపి ఎంఎల్ఏలు తమ పార్టీలోకి వచ్చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆమధ్య అసెంబ్లీలో స్వయంగా జగన్మోహన్ రెడ్డే చెప్పటంతో ఏరోజు ఎవరు రాజీనామా చేస్తారో తెలీక చంద్రబాబు టెన్షన్ పెరిగిపోతోంది.

సరే వైసిపి విషయాన్ని పక్కనపెడితే టిడిపికి అతిపెద్ద ప్రమాదం బిజెపి నుండి ముంచుకొస్తోందని సమాచారం. ముందుగా టిడిపి ఎంపిల మీద బిజెపి కన్నేసిన ఇపుడు ఎంఎల్ఏల మీద కూడా చూపు సారించింది.  బిజెపి జాతీయ కార్యదర్శి, ఏపి ఇన్చార్జి సునీల్ దియోధర్ మాటలు వింటుంటే టిడిపిలో టెన్షన్ పెరిగిపోతోంది.

పైగా విజయవాడ ఎంపి కేశినేని నానితో ఉన్న పరిచయాలను అడ్డం పెట్టుకునే కేశినేని నానిని లాక్కునేందుకు బిజెపి ప్రయత్నిస్తోంది. గడచిన కొద్ది రోజులుగా పార్టీలో  కేశినేని నాని  చేస్తున్న రచ్చ అంతా ఇందులో భాగమే అని అంటున్నారు. నాని తో బిజెపి నేతలు రెగ్యులర్ గా టచ్ లో ఉన్నారని టిడిపి నేతలే అంటున్నారు. ప్రస్తుతానికి నాని  కాస్త సైలెంట్ గా ఉన్నా జంప్ అయిపోవటం ఖాయమంటున్నారు.

బిజెపిలోకి నాని వెళ్ళిపోవటం ఖాయమని కానీ ముహూర్తమే నిర్ణయమవ్వాలని అంటున్నారు. ఒకసారి నాని గనుక టిడిపిని వదిలేస్తే అదే బాటలో కొందరు ఎంఎల్ఏలు కూడా వెంటనే నిర్ణయం తీసుకుంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి ఏదో రూపంలో టిడిపికి  దెబ్బ ఖాయమనే అనిపిస్తోంది.