తెలుగుదేశంపార్టీ ముఖ్య నేతలపై వరుసబెట్టి ఐటి దాడులు మొదలవటంతో చంద్రబాబునాయుడులో టెన్షన్ మొదలైంది. మొన్ననే కేంద్ర మాజీమంత్రి సుజనా చౌదరి కార్యాలయాలపై ఈడీ దాడులు జరిగాయి. ఈరోజు ఉదయం సిఎం రమేష్ ఇళ్ళు, కార్యాలయాలపై దాడులు మొదలయ్యాయి. అంతకుముందు విజయవాడ, విశాఖపట్నం, నెల్లూరు కేంద్రంగా ఐటి దాడులు జరిగాయి. పనిలో పనిగా నెల్లూరు, చెన్నై కేంద్రంగా మరో టిడిపి నేత ఇళ్ళు, కార్యాలయాలపై ఐటి దాడులు జరిగాయి. ఇవన్నీ చూస్తుంటో త్వరలో చంద్రబాబు మీదకానీ లేకపోతే లోకేష్ పైన కాని ఐటి, ఈడీ దాడులు జరుగుతాయనే ప్రచారం బాగా పెరిగిపోతోంది.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇప్పటి వరకూ జరిగిన దాడులన్నీ చంద్రబాబుకు అత్యంత సన్నిహితులపైనే. మొదట నెల్లూరు, చెన్నైలోని బీద మస్తాన్ రావు ఇళ్ళు, కార్యాలయాలపై ఐటి దాడులతో మొదలయ్యాయి. మస్తాన్ రావు చంద్రబాబుకు అత్యంత సన్నిహితుల్లో ఒకరు. పెద్ద ఎత్తున నిర్మాణ రంగంలోను, రొయ్యల వ్యాపరంలోను ఉన్నారు. రాజధాని నిర్మాణ కమిటీలో సభ్యుడు కూడా. సుజనా చౌదరి, సిఎం రమేష్ కు చంద్రబాబుతో ఉన్న సన్నిహిత సంబంధాలపై కొత్తగా చెప్పేదేమీ లేదు.
ఈమధ్యనే విజయవాడ, నెల్లూరు, విశాఖపట్నంలోని పలువురు వ్యాపారస్తులపై జరిగిన ఐటి దాడుల్లో కూడా చంద్రబాబుకు సన్నిహితులున్నారు. ప్రకాశం జిల్లాలోని ఓ ఎంఎల్ఏ పాలేటి రామారావు కార్యాలయాలపైన కూడా దాడులు జరిగాయి. అదే సందర్భంలో నిర్మాణ రంగంలోని సంస్ధలు, రియల్ ఎస్టేట్ సంస్ధల కార్యాలయాలపైన కూడా దాడులు జరిగాయి. దాడుల్లో విలువైన డాక్యుమెంట్లు, బినామీ వ్యవహారాలకు ఆధారాలుగా ఉపయోగపడే పలు డాక్యుమెంట్లు వెలుగుచూసినట్లు ప్రచారం జరుగుతోంది.
రాజకీయాల్లో ఒక నీతుంది. అదేమిటంటే ప్రత్యర్ధి చాలా బలవంతుడైనపుడు నేరుగా ఢీ కొనరు. ప్రత్యర్ధకి బాగా సన్నిహితులపై దృష్టి పెడతారు. ముందుగా ప్రత్యర్ధి చుట్టు ఉన్న వారిని దెబ్బ కొట్టటం ద్వారా అసలు లక్ష్యాన్ని వీక్ చేస్తారు. ఇక్కడ చంద్రబాబు విషయంలో కూడా అదే జరుగుతోందా అనే అనుమానాలు మొదలయ్యాయి. చుట్టూ ఉన్న వారిపై ఉచ్చు బిగించటం ద్వారా చంద్రబాబును బిగించేయాలని ప్లాన్ జరుగుతున్నట్లుంది. ఎలాగూ అందరిపైనా విపరీతమైన ఆర్ధిక ఆరోపణలున్నాయి. వందల కోట్ల రూపాయలు రుణాలు తీసుకుని బ్యాంకులను మోసం చేయటం, ఆర్ధిక సంస్ధలను మోసం చేశారనే ఆరోపణలకు కొదవే లేదు. కాబట్టి ఐటి, ఈడీ సంస్ధలు గనుక గట్టిగా బిగించదలిస్తే చాలా తేలిగ్గా వాళ్ళు దొరికిపోతారు. ఒకసారి వాళ్ళు దొరికితే చంద్రబాబును బిగించంటం కూడా పెద్ద కష్టమేమీ కాదు.