మొన్నటి పోలింగ్ తర్వాత కొన్ని వర్గాల ఓటర్ల మొగ్గు ఎటో తెలీక పార్టీల్లో కంగారు మొదలైంది. అటువంటి వర్గాల్లో కాపు సామాజికవర్గం ఒకటి. అందులోను కాపుల ఓట్లు ఎవరికి పడ్డాయో అర్ధంకాక తెలుగుదేశంపార్టీ నేతలు బాగా టెన్షన్ తో నలిగిపోతున్నారు. పోలింగ్ కు ముందు వరకూ జనసేన ప్రభావం ఉంటుందని పెద్దగా ఎవరూ అనుకోలేదు. పవన్ వీరాభిమానుల్లో తప్ప ఇంకోరిలో పవన్ ఫ్యాక్టర్ గురించి ఆలోచనే కనబడలేదు.
ఎందుకంటే జాతీయ మీడియా చేసిన ఏ సర్వేలో కూడా జనసేన ప్రభావం గురించి ఎక్కడా ప్రస్తావన లేదు. పోలింగ్ దగ్గరకు వచ్చేసరికి చివరకు పవన్ పోటి చేసిన భీమవరం, గాజువాక అసెంబ్లీ నియోజకవర్గాల్లో భీమవరంలో ఓటమి ఖాయమంటూ విపరీతమైన ప్రచారం జరిగింది. చివరకు గాజువాకలో గెలుపు కూడా డౌటే అనే స్ధాయికి చేరుకుంది ప్రచారం.
అయితే, పోలింగ్ తర్వాత అందుతున్న విశ్లేషణల ప్రకారం ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలతో పాటు ఉభయగోదావరి జిల్లాల్లో జనసేనకు కూడా పర్వాలేదు అన్నట్లుగా ఓట్లు పడ్డాయని అంటున్నారు. మొదటిసారి ఓటుహక్కు వినియోగించుకున్న ఓటర్లు 25 లక్షలట. ఓ విశ్లేషణ ప్రకారం మొదటిసారి ఓటర్లలో ఎక్కువగా పవన్ అభిమానులే ఉన్నారట. కాబట్టి వాళ్ళ ఓట్లలో ఎక్కువభాగం జనసేనకే పడ్డాయనేది ఓ సమాచారం.
అలాగే కాపు సామాజికవర్గంలోని అభిమానులు కూడా పవన్ కు ఓట్లేశారని చెబుతున్నారు. ఈ రెండు వర్గాల వల్ల ప్రతీ నియోజకవర్గంలోను సుమారు నాలుగు లేదా ఐదు వేల దాకా ఓట్లు పడుంటాయని అంచనా వేస్తున్నారు. ఈ ఓట్లతో జనసేన అభ్యర్ధులు ఎక్కడా గెలిచే అవకాశం లేదు. కానీ టిడిపి, వైసిపి అభ్యర్ధుల్లో ఒకరిని ఓడగొట్టటానికి పనికి వస్తుంది. చాలా తక్కువ నియోజకవర్గాల్లో అంటే రాజోలు, తాడేపల్లిగూడెం, తిరుపతి లాంటి నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్ధులు టిడిపి, వైసిపి అభ్యర్ధులకు ధీటుగా పోటీ ఇచ్చారట. దాంతో జనసేనకు పడే ఓట్లు ఎవరికి నష్టమో తెలీదు కానీ టిడిపి నేతల్లో మాత్రం కంగారు పెరిగిపోతోందట.