యాంకర్ అత్యుత్సాహం… చంద్రబాబు బలి!

ప్రస్తుతం ఆన్ లైన్ లో ఒక చిన్న వీడియో వైరల్ అవుతుంది. అత్యుత్సాహంతో చేశారో లేక అర్థజ్ఞానంతో చేశారో తెలియదు కానీ… ఒక ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ కు సంబంధించిన యాంకర్ ఒకరు అమరావతి భూములపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది ఖచ్చితంగా చంద్రబాబును ఇరకాటంలో పాడేసే కామెంట్లే అనడంలో సందేహం ఉండకపోవచ్చు! కారణం… ప్రభుత్వాలు తీసుకోబోయే నిర్ణయాలేమిటో ఆయన ఊహించి చెప్పేశారు.. కాదు కాదు కన్ ఫాం చేసేశారు! విచిత్రం ఏమిటంటే… ఆ కామెంట్లను టీడీపీ నేతలెవరూ ఖండించలేదు!

వివరాళ్లోకి వెళ్తే… ప్రస్తుతం రాజధాని అమరావతి ప్రాంతంలో పేదలకు జగన్మోహన్ రెడ్డి ఇళ్ళపట్టాలను పంపిణీ చేస్తున్నారు. అత్యంత ఘనంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. పేదవాడి బ్రతుకులో ఇదొక సువర్ణాధ్యాయం అని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. సరిగ్గా ఈ విషయమై ఛానల్ లో జరిగిన డిబేట్లో యాంకర్ మాట్లాడుతు… ఇపుడు జగన్ ఇస్తున్న ఇళ్ళపట్టాలను రాబోయే కొత్త ప్రభుత్వం రద్దు చేస్తుందని ప్రకటించాడు. రాసిపెట్టుకోండి… వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పట్టాలు మళ్లీ వెనక్కి తీసేసుకుంటుందన్న రేంజ్ లో చెప్పారు!

నిజానికి ఇళ్ళపట్టాలు పంపిణీ అన్నది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం. ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయాన్ని, తీసుకోబోయే నిర్ణయాన్ని ఒక టీవీ ఛానల్ లో కూర్చున్న యాంకర్ ఎలా ప్రకటిస్తారు? అలా ప్రకటించారంటే అది చంద్రబాబు మనసులో మాటే అనే సంకేతాలు జనాల్లోకి వెళ్లినట్లే కదా! కారణం… ఆ ఛానల్ పూర్తిగా టీడీపీ అనుకూల మీడియాలో భాగమనేది బహిరంగ రహస్యం. దీంతో… చంద్రబాబు తన మనసులో మాట నేరుగా చెప్పలేక, సదరు టీవీ ఛానల్ తో చెప్పించారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

దీంతో ప్రస్తుతం ఆ వ్యాఖ్యలు వైరల్ గా మారుతున్నాయి. ఈ వ్యాఖ్యలు రెండు రకాల ఫలితాలు ఇవ్వబోతున్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అందులో ఒకటి… ఆ ఛానల్ మరీ బరితెగించేసి, రాబోయే ప్రభుత్వాలు ఏయే నిర్ణయాలు తీసుకోబోతున్నాయో కూడా చెబుతున్నాయని కాగా… మరొకటి, చంద్రబాబు ని ఒక వర్గం మీడియా నడిపిస్తుందని.. మరియూ… చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తే పేదలకు జగన్ ఇస్తున్న ఇండ్ల స్థలాలు వెనక్కి తీసేసుకుంటారని!