కులాంతర వివాహం చేసుకొని హత్యకు గురైన ప్రణయ్ కేసు వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రణయ్ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మిర్యాలగూడ కాంగ్రెస్ నేత కరీంను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు నల్లగొండ డిసిసి ప్రకటించింది.
ప్రణయ్ కుటుంబాన్ని కాంగ్రెస్ నేత జానారెడ్డి పరామర్శించారు. ప్రణయ్ కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రణయ్ భార్య అమృతకు అండగా ఉంటామని ఆయన హామీనిచ్చారు. ఈ హత్య కేసులో భాగస్వామ్యం ఉందని తెలిసి వెంటనే కరీంను పార్టీ నుంచి సస్పెండ్ చేశామని, ఈ కేసులో ఎంతటివారున్నా కఠినంగా శిక్షించాలని జానారెడ్డి డిమాండ్ చేశారు.
ప్రణయ్ హత్య కేసులో అమృత తండ్రి మారుతిరావు, అతడి తమ్ముడు శ్రావణ్ కుమారులతో పాటుగా మిర్యాలగూడకు చెందిన కాంగ్రెస్ నేత కరీంను పోలీసులు అరెస్టు చేశారు. కరీం మిర్యాలగూడ పట్టణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. ప్రణయ్ హత్య విషయంలో కరీం సహకరించారని ఆయన కూడా ప్రముఖ సూత్రధారిగా ఉన్నట్టు పోలీసు విచారణలో తేలింది. వెంటనే కరీంను పార్టీ నుంచి సస్పెండ్ చేసి కాంగ్రెస్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది.