టీడీపీ మహానాడులో వైఎస్ జగన్ భజన

TDP Mahanadu

2019 ఎన్నికల్లో చావు దెబ్బ తిన్న తెలుగుదేశం పార్టీ, 2024 ఎన్నికల నాటికి ఎలా బలం పుంజుకోవాలన్నదానిపై తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం నేపథ్యంలో మహానాడు వేదికగా చర్చ జరగాలి. కానీ, అలా జరుగుతోందా.? జరగడంలేదు. చంద్రబాబు మీద పొగడ్తల కన్నా, ఎన్టీయార్ స్మరణ కన్నా ఎక్కువగా.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు చాలామంది టీడీపీ నేతలు మహానాడు వేదికపై.

రాజకీయాల్లో ఇదొక వింత పోకడ. కొన్నాళ్ళ క్రితం జనసేన పార్టీకి సంబంధించిన ఆవిర్భావ దినోత్సవ సంబరాల్లోనూ ఇలాగే జరిగింది. ఆ మాటకొస్తే, రేప్పొద్దున్న వైసీపీకి సంబంధించిన వేడుకల్లో కూడా ఇదే జరుగుతుందేమో.! అసలు రాజకీయమంటేనే అంత.. అన్నట్టు తయారైంది పరిస్థితి.

సరే, జనసేన అంటే ఇంకా రాజకీయ అనుభవం లేదని అనుకోవచ్చు. వైసీపీ సంగతి ప్రస్తుతానికి పక్కన పెడదాం. సుదీర్ఘ రాజకీయ అనుభవం తన సొంతమని చెప్పుకుంటుంటారు చంద్రబాబు. తాను చాలా సీనియర్.. రాజకీయ నాయకుడిగా.. ముఖ్యమంత్రిగా పని చేసిన అనుభవం వున్న వ్యక్తిగా.. అని చంద్రబాబు చెప్పుకుంటుంటారు.

మరి, ఆ అనుభవాన్ని రంగరించి, పార్టీ నాయకులకు సరైన దిశానిర్దేశం చేయాలి కదా.? మహానాడు అంటే టీడీపీ పండుగ.. ఈ పండుగలో టీడీపీ సాధించిన విజయాల గురించి చెప్పుకుని స్ఫూర్తి పొందడం, చవిచూసిన ఎదురు దెబ్బల నుంచి గుణపాఠాలు నేర్చుకోవడం వంటివి కదా చేయాలి టీడీపీ నేతలెవరైనా.? అదే కదా, కార్యకర్తలకు సరైన దిశా నిర్దేశం చేయడానికి పనికొస్తుంది.?

ప్చ్.! ఆ సోయే ఎవరికీ లేకుండా పోయింది. సొంత భజన కూడా సరిగ్గా చేసుకోకుండా, ఇతరుల మీద పడి ఏడవడం ఎంతవరకు సబబు.?