దళిత విద్యార్థిని రమ్య, గుంటూరులో పట్ట పగలే దారుణ హత్యకు గురైన ఘటన అత్యంత బాధాకరమైనది. ఈ విషయమై ప్రభుత్వాన్ని విపక్షాలు నిలదీయడాన్ని తప్పు పట్టలేం. ప్రభుత్వం సైతం, రాష్ట్రంలో మహిళలకు భద్రత కల్పించలేని పరిస్థితి ఎందుకొచ్చింది.? వారి ప్రాణాల్ని ఎందుకు కాపాడలేకపోతున్నట్లు.? అన్న విషయమై ఆత్మవిమర్శ చేసుకోవాల్సి వుంది. అది వేరే సంగతి. అయితే, ఇక్కడ తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఓవరాక్షన్ అస్సలేమాత్రం సమర్థనీయం కాదు. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, ఇలాంటివి జరుగుతూనే వుంటాయి. అలాగని, ఘటనలు జరగాలని ఎవరూ కోరుకోరు. కొన్ని మానవ మృగాల కారణంగా ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. అలాంటివారిపై ఉక్కుపాదం మోపి తీరాల్సిందే.
చంద్రబాబు హయాంలో రిషితీశ్వరి, సుగాలి ప్రీతి.. ఇలా చాలా ఘటనలు జరిగాయి. అప్పట్లో చంద్రబాబు సర్కార్, ఏం చేసింది.? ఎలాంటి చర్యలు తీసుకుంది.? సుగాలి ప్రీతి విషయంలో ఇప్పటికీ ఆమె తల్లిదండ్రులు పోరాటం చేస్తూనే వున్నారు న్యాయం కోసం. ఆ ఘటనకు టీడీపీ బాధ్యత తీసుకుంటుందా.? అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ ఘటనకు బాధ్యత వహించి, పదవి నుంచి వైదొలగారా.? కానీ, ఇప్పుడు వున్నపళంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్, తన పదవికి రాజీనామా చేయాలంటూ మాజీ మంత్రి, టీడీపీ నేత నారా లోకేష్ సహా, చాలామంది టీడీపీ నేతలు డిమాండ్ చేసేస్తున్నారు. రాజకీయాల్లో ఈ తరహా విమర్శలు సహజమే అయినా, ఇలాంటి విషయాల్లో.. ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాలి. ప్రభుత్వానికి సూచనలివ్వాలి, ఆయా చట్టాల రూపకల్పనలో మద్దతివ్వాలి. కానీ, ఇలాంటి ఘటనల్లో రాజకీయం ఏరుకోవడానికే ఏ పార్టీ అయినా ప్రయత్నిస్తుంటుంది. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే పరిమితమైన దిగజారుడు రాజకీయం కాదు. దేశమంతటా ఇదే దుస్థితి.