టిడిపికి 135 సీట్లా ? వైసిపికి 35 సీట్లేనా ?

జాతీయ మీడియా సర్వేలన్నీ వైసిపికే అఖండ విజయమని తేల్చేసిన విషయం తెలిసిందే. దాంతో టిడిపికి కాస్త బూస్టప్ ఇచ్చే ఉద్దేశ్యంతో చంద్రబాబు మీడియా రంగంలోకి దిగింది. అందులో భాగంగానే రాబోయే ఎన్నికల్లో డిపికే పట్టమంటూ ఓ సర్వే ఫలితమంటూ ఓ కథనాన్ని ఇచ్చింది.  ఏబిపి మీడియా కోసం లోక్ నీతి-సిఎస్ డిఎస్ సర్వే జరిపింది. ఆ సర్వేలో టిడిపి అఖండ విజయం సాధిస్తుందని అంచనా వేసింది.  

సదరు సర్వేలో టిడిపి ఏకంగా 135 సీట్లు వస్తాయన్న విషయం తేలిపోయిందట. ప్రధాన ప్రతిపక్ష వైసిపికి 45 సీట్లకు పరిమితమవుతుందని కూడా సర్వేలో తేలిపోయింది. అదే విధంగా 25 పార్లమెంటు సీట్లలో కూడా  టిడిపికి మంచి మెజారిటీ వస్తుందట. పార్లమెంటు స్ధానాల్లో కూడా 18-22 సీట్లొస్తాయని సర్వేలో తేలిపోయిందని చంద్రబాబు మీడియా చెప్పింది. జనసేనకు కూడా ఓ 5 సీట్లను ఇచ్చింది లేండి.

టిడిపికి 46.2 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉండగా వైసిపికి మాత్రం 37.2 శాతం ఓట్లే వస్తాయని సర్వేలో తేలిందట. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలనే కొనసాగాలని జనాలు కోరుకుంటున్నారట. జగన్, పవన్ తో పోల్చితే చంద్రబాబుపైనే జనాల్లో ఎక్కువ విశ్వాసం ఉందట. పోలవరం నిర్మాణం, నదుల అనుసంధానం, రాజధాని అమరావతి నిర్మాణం, పెట్టుబడుల ఆకర్షణ, కియా మోటార్ సంస్ధ ఏర్పాటు లాంటివి చంద్రబాబు సామర్ధ్యానికి ఉదాహరణలుగా జనాలు చెప్పుకుంటున్నారట.

ఇక జగన్ కు ఎందుకు వ్యతరేకమంటే, మనీల్యాండరింగ్, క్విడ్ ప్రో కో కేసులుండటం, బాబాయ్ వివేకానందరెడ్డి హత్యకేసులో జగన్ అండ్ కో పై అనుమానాలు, అసెంబ్లీ ని బహిష్కరించటం లాంటి కారణాలతో జగన్ పై వ్యతిరేకత కనిపిస్తోందట. కాబట్టి జగన్ ఓటమి ఖాయమని చంద్రబాబు మీడియా తేల్చేసింది.