అదేంటీ.. టీడీపీ – జనసేన కలిసి పోటీ చేయాలి కదా.? అలాంటప్పుడు, ఓ నియోజకవర్గంలో ఏదో ఒక పార్టీకి చెందిన అభ్యర్థే కదా పోటీ చేయాలి.? దానికి భిన్నంగా అభ్యర్థుల్ని ఇన్‌ఛార్జిల పేరుతో ఇరు పార్టీలూ ఎందుకు పలు నియోజకవర్గాలకు ఖరారు చేస్తున్నట్టు.?
టీడీపీ ప్రకటించేసుకున్న నియోజకవర్గాల్లో జనసేన.. జనసేన ప్రకటించుకున్న నియోజకవర్గాల్లో టీడీపీ.. తమ తమ ఇన్‌ఛార్జీలను నియమిస్తున్నాయి. అంటే, ఒకరి మీద పోటీగా ఇంకొకరన్నమాట. తాజా ప్రకటన రాజానగరం నియోజకవర్గం నుంచి. ఈ నియోజకవర్గంలో జనసేనకి ఎడ్జ్ కాస్త బెటర్‌గానే వుంది.. టీడీపీతో పోల్చితే.. అదీ గత కొద్ది రోజులుగా మారిన ఈక్వేషన్ నేపథ్యంలో.
రాజానగరం జనసేన ఇన్‌ఛార్జి ప్రకటన ఇటీవల జరగ్గా, దానికి కౌంటర్ ఎటాక్ టీడీపీ ఇచ్చేసింది. చంద్రబాబేమో ‘జనసేన విషయంలో సంయమనంతో వ్యవహరిద్దాం..’ అని చెబుతుంటే, నారా లోకేష్ మాత్రం, కౌంటర్ ఎటాక్ వైపే మొగ్గు చూపుతున్నారు. సో, పరిస్థితి తారుమారవుతోంది.. రెంటికీ చెడ్డ రేవడిలా మారబోతోంది.
మొన్నటికి మొన్న తణుకు నియోజకవర్గం విషయంలోనూ ఇలాగే జరిగింది. చూస్తోంటే.. టీడీపీ – జనసేన మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరు సహజంగానే వైసీపీకి కలిసొస్తుంది. వైనాట్ 175 అని వైఎస్ జగన్ ఊరికే అనడంలేదని ఇప్పుడిప్పుడే ఇటు టీడీపీ శ్రేణులకీ, అటు జనసేన శ్రేణులకీ అర్థమవుతోంది.
వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకు చీలిపోకూడదని చెబుతున్న జనసేనాని.. కలిసే వైసీపీని ఎదుర్కొంటామని చెబుతున్న టీడీపీ అధినేత.. అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఈ మొత్తం గేమ్‌ని వైసీపీ ఎంజాయ్ చేస్తోంది.
