రిజర్వేషన్ల కోసం కాపుల ఉద్యమమట

మొన్నటి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయినా జనాలను మోసం చేసే బుద్ధిని మాత్రం టిడిపి వీడటంలేదు. అధికారంలో నుండి దిగిపోయిన తర్వాత కాపుల రిజర్వేషన్ల కోసం తెలుగుదేశంపార్టీ ఉద్యమాలు చేస్తుందట. చంద్రబాబునాయుడు అమెరికా పర్యటన నుండి తిరిగిరాగానే భేటి అయి ఉద్యమానికి ఓ రూపమిస్తామని మాజీ ఎంఎల్ఏ జ్యోతుల నెహ్రు చెబుతున్నారు.

కాపులను బిసిల్లో చేరుస్తు చంద్రబాబు చేసిన చట్టాన్ని జగన్మోహన్ రెడ్డి అమలు చేయాలని నెహ్రు డిమాండ్ చేయటమే విచిత్రంగా ఉంది. అధికారంలోకి రావటానికి, వచ్చిన తర్వాత కూడా కాపులను చంద్రబాబు  ఏ విధంగా మోసం చేసింది అందరికీ తెలుసు. రిజర్వేషన్ల అంశం కేంద్రపరిధిలోనిది అని తెలిసి కూడా  బిసిల్లోకి చేరుస్తాననే తప్పుడు హామీనిచ్చి చంద్రబాబు కాపులను మోసం చేశారు.

చంద్రబాబు మోసాన్ని గ్రహించారు కాబట్టే మొన్నటి ఎన్నికల్లో చిత్తుగా ఓడగొట్టారు. అయినా టిడిపికి బుద్ధిరాలేదు. చంద్రబాబు కాపులను బిసిల్లోకి చేరుస్తు చేసిన చట్టాన్ని జగన్మోహన్ రెడ్డి అమలు చేయాలంటూ డిమాండ్ చేయటమే విచిత్రంగా ఉంది. జగన్ గనుక కాపులను బిసిల్లో చేర్చే చట్టాన్ని అమలు చేయకపోతే తొందరలోనే ఉద్యమం చేస్తామని బెదిరించటమే విడ్డూరం.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే తమలాగే జగన్ కూడా తప్పుడు హామీ లివ్వాలని టిడిపి కోరుకుంటోంది. రిజర్వేషన్ల అంశంలో తాము ఇబ్బందులు పడినట్లే జగన్ కూడా ఇబ్బంది పడాలని టిడిపి ఆశిస్తున్నట్లే ఉంది. రిజర్వేషన్ల అంశం రాష్ట్రపరిధిలోనిది కాదన్న విషయం తెలుసు కాబట్టే జగన్ హామీ ఇవ్వలేదు.  మొత్తం మీద ఏదో కారణంతో జగన్ ను బెదిరించేందుకు టిడిపి చేస్తున్న ప్రయత్నాలు మాత్రం భలేగా ఉంది.