తెలుగు దేశం పార్టీ పుట్టినప్పటి నుండి పార్టీలో ఉన్న నాయకురాలు కావలి ప్రతిభా భారతి. ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా ఆమె ఎదురీత రాజకీయాలలోనే నెట్టుకొచ్చారు. శ్రీకాకుళంలో మొదటి నుండి కింజరపు ఫ్యామిలీ, కళా ఫ్యామిలీల రాజకీయాలను తట్టుకుంటూ ముందడుగేస్తూ వచ్చారు. అధిష్టానమే తనను గుర్తించి పదవులు ఇచ్చేలా చేసుకున్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గం నుండి వరుసగా ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆమె రాజాం నుండి కూడ ఒకసారి శాసనసభకు ఎన్నికయ్యారు. స్పీకర్ బాధ్యతలను కూడ నిర్వహించారు. దళిత నాయకురాలిగా శ్రీకాకుళం జిల్లాలో బలమైన క్యాడర్ కలిగిన వ్యక్తి ఆమె.
కానీ గత కొన్నేళ్లుగా ఆమె రాజకీయ జీవితం పాతాళానికి పడిపోయింది. 2014లో రాజాం నుండి చివరిసారిగా పోటీచేసిన ఓడిన ఆమెకు ఆ తర్వాత పోటీచేసే అవకాశం కూడ దక్కలేదు. 2014 ఎన్నికల్లో కూడా కళా వెంకట్రావ్ రాజకీయం మూలానే తాను ఓడిపోయానని వాపోయారామె. అప్పుడు చంద్రబాబు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టినా ఆ తర్వాత పట్టించుకోలేదు. ఆ తర్వాత నుండి ఆ రెండు ఫ్యామిలీ ఆధిక్యం బాగా పెరిగిపోవడంతో పార్టీలో భారతి మాటకు విలువే లేకుండా పోయింది అంటారు శ్రీకాకుళం రాజకీయాలతో పరిచయం ఉన్న నేతలు. ఈ నేపథ్యంలో ప్రతిభా భారతి తన కుమార్తెను రాజకీయాల్లోకి తీసుకురావాలని అనుకుంటున్నారు. కానీ టీడీపీలో తన మాట చెల్లుబడి కానప్పుడు ఇక తన కుమార్తెను పట్టించుకుంటారా అనే అనుమానం మొదలైంది ఆమెలో.
అందుకే కుమార్తె భవిష్యత్తు కోసం టీడీపీని వీడి వైసీపీ తలుపులు తట్టాలని భావిస్తున్నారట. ఇటీవల మీడియాతో మాట్లాడిన ఆమె మారిన పరిస్థితులకు అనుగుణంగా మనమే మారాలని అంటూ తన నిర్వేదాన్ని చెప్పుకొచ్చారు. ఆ మాటలతో పార్టీ మారే ఆలోచనలో ఆమెలో బలంగా ఉన్నట్టు అర్థమైంది. ఇక వైసీపీ విషయానికొస్తే ఎస్సీ వర్గాల్లో మంచి పట్టున్న ప్రతిభా భారతిని జగన్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానిస్తారు. అంతేకాదు శ్రీకాకుళంలో టీడీపీ హవాకు చెక్ పెట్టడానికి ఆమెనే ప్రయోగిస్తారు. అదే జరిగితే ఆ జిల్లాలో టీడీపీ సగం రోడ్డు మీదకు వచ్చేసినట్టే అనుకోవాలి.