ఆ యాత్రల పేరు “ప్రజా చైతన్య యాత్రలు”… కానీ ఆ యాత్రలు పేదలకు వ్యతిరేకంగా పనిచేస్తుంటాయి.. పేదలకు అనుకూలంగా ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలపై తమ నిరసనను తెలియజేస్తుంటాయి.. అక్కడితో ఆగకుండా కోర్టు గడపలను కూడా తొక్కుతుంటాయి. అందులో భాగంగా మరోసారి ఈ యాత్రలు.. పేదలకు వ్యతిరేకంగా ఈ నెల 24నుంచి మొదలుకాబోతున్నాయి.
అవును… అమరావతి రైతు జేఏసీ నాయకత్వంలో 24వ తేదీనుండి దశలవారీగా యాత్రలు చేయబోతున్నారు. కృష్ణాయపాలెం నుండి నిడమర్రు వరకు ఆందోళనలు చేయాలని వారు నిర్ణయించారు. అమరావతి ప్రాంతంలో రాజధానికి భూములు ఇచ్చిన రైతులంతా ఆందోళనల్లో పాల్గొనాలని ఈ సందర్భంగా రైతు జేఏసీ పిలుపిచ్చింది. ఇంతకూ ఈ కొత్త యాత్రలు ఎందుకంటే… “పేదలకు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ”!
ఇపుడు పేదలకు పట్టాల పంపిణీ కార్యక్రమానికి వ్యతిరేకంగా కొందరు ముందు హైకోర్టులోను తర్వాత సుప్రింకోర్టులోను కేసులు వేశారు. దీంతో… పట్టాల పంపిణీ కార్యక్రమం ప్రస్తుతం కోర్టుల విచారణలో ఉంది. అయితే… అమరావతి జేఏసీ వేసిన కేసుల్లో కోర్టు.. ప్రభుత్వ నిర్ణయంపై స్టే ఇవ్వలేదు! దీంతో 1152 ఎకరాల్లో 75 వేలమందికి పట్టాలు పంపిణీ చేయాలని జగన్ నిర్ణయించారు. అనంతరం జగనన్న కాలనీలు కూడా నిర్మించాలని ఫిక్సయ్యారు.
ఇక్కడ జేఏసీ నాయకులు చెబుతున్న కొత్త లాజిక్ ఏమిటంటే… కోర్టుల్లో కేసులున్నా కూడా ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుంది అని ప్రశ్నిస్తున్నారు. దీంతో… మరి కోర్టుల్లో కేసులున్నా కూడా అవి ప్రభుత్వ నిర్ణయంపై ఎలాంటి స్టే ఇవ్వలేదు కదా.. అయినా కోర్టుల్లో కేసులున్నప్పుడు మీరు మాత్రం యాత్రలు ఎందుకు చేస్తున్నారు? అంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారు పట్టాల కోసం ఎదురుచూస్తూ… తమకు కూడా తలదాచుకోవడానికి ఒక గూడు దొరుకుంతని భావిస్తున్న పేదలు!
మరి ఈ విషయంలో పేదలకు ప్రభుత్వం ఇళ్ల పట్టాలు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ కొందమంది జేస్తున్న ఈ యాత్రలపై… ప్రజల తరుపున ఉంటూ, పేదల తరుపున పోరాడాల్సిన ప్రతిపక్ష నాయకులు, జనసైనికులు, కమ్యునిస్టులు ఎలా స్పందిస్తారన్నది వేచి చూడాలి!