అధికారాన్ని అడ్టుపెట్టుకుని తెలుగుదేశంపార్టీ నేతల హల్ చల్ చేస్తున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో ఉదయం మొదలైన పోస్టల్ బ్యాలెట్ సందర్భంగా టిడిపి నేతలు ఏకంగా పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్ళిపోతున్నారు. టిడిపి అభ్యర్ధిగా నారా లోకేష్, వైసిపి అభ్యర్ధిగా ఆళ్ళ రామకృష్ణారెడ్డి పోటీ చేస్తున్నారు కాబట్టి యావత్ రాష్ట్రమంతా మంగళగిరి ఎన్నిక ఫలితంపైనే దృష్టి పెట్టింది. ప్రతీ ఓటూ కీలకమైన ఈ దశలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కోసం టిడిపి నేతలు నానా గోల చేస్తున్నారు.
నిజానికి పోలింగ్ కేంద్రాల్లోకి పోలింగ్ ఏజెంట్లు కానీ లేకపోతే అభ్యర్ధి తరపున చీఫ్ పోలింగ్ ఏజెంట్, అభ్యర్ధి మాత్రమే వెళ్ళేందుకు అవకాశం ఉంది. ఇది పోస్టల్ బ్యాలెట్ కాబట్టి పోలింగ్ ఏజెంట్లతో పెద్దగా పనిలేదు. వైసిపి తరపున అభ్యర్ధి ఆళ్ళ మాత్రం బూత్ దగ్గర ఉన్నారు. అదే సమయంలో దాదాపు 15 మంది టిడిపి నేతలు ఏకంగా పోలింగ్ కేంద్రాల్లోకే వెళ్ళిపోయారు. యధేచ్చగా ఓట్లు వేస్తున్న వాళ్ళ దగ్గరకు వెళ్ళి ప్రలోభాలకు తెరలేపారు.
పోలింగ్ కేంద్రాల్లోకి టిడిపి నేతలు రావటం, ఓటర్లతో మాట్లాడటం పోలింగ్ అధికారులు, పోలీసులు చూస్తూనే ఉన్నారు. అయినా ఒక్కరు కూడా టిడిపి నేతలను బయటకు పంపే ప్రయత్నం చేయలేదు. ఆళ్ళ అభ్యంతరాలు చెప్పినా ఎవరూ వినలేదు. దాంతో ఇక్కడ జరుగుతున్న విషయాన్ని ఆళ్ళ వెంటనే ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు చేశారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.