పొత్తులపై తమ్ముళ్ల అభిప్రాయం… బాబుకి అర్ధమవుతుందా?

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ వాతావరణం తమకు అనుకూలంగా మారుతుందని, ప్రజలు మళ్లీ చంద్రబాబునే కోరుకుంటున్నారని టీడీపీ నేతలు కాన్ ఫిడెంట్ గా ఉన్నారు. ఇదే సమయంలో తన సభలకు వస్తున్న ఆదరణ చూసి చంద్రబాబు సైతం ఇదే నమ్మకంతో ఉన్న్నారు. అయితే ఈ సమయంలో అధినేత చంద్రబాబుకు టీడీపీ కార్యకర్తలు, కొందరు నేతలు ఒక కీలక సూచన చేస్తున్నారు.

రాష్ట్రంలో ఎంత బలంగా ఉన్నప్పటికీ.. ఒక జాతీయస్థాయి పార్టీతో పొత్తు ఉంటే మంచిదని చంద్రబాబు బలంగా నమ్ముతున్నారు. ఇందులో భాగంగా… బీజేపీతో పొత్తు కోసం ప్రాకులాడినంతపని చేశారు. అయితే బీజేపీ పెద్దలతో పాటు అటు తెలంగాణ బీజేపీ నేతలు సైతం చీత్కరించినట్లుగా మాట్లాడుతున్నారు! దీంతో ఇక బీజేపీతో పొత్తు పంచాయతీ లేదని తేలిపోయింది.

దీంతో తమ్ముళ్లు హ్యాపీ ఫీలవుతున్నారంట. ఒంటరిగ అధికారంలోకి రాబోతున్నప్పడు మళ్లీ ఈ ఎగస్ట్రా లగేజ్ ఎందుకని అంటున్నారంట. పైగా బీజేపీతో పొత్తుకు వెళ్తే… 15 – 20 మంది టీడీపీ నేతలు త్యాగాలు చేయాల్సి వస్తుందని చెబుతున్నారంట. ఇదే అసలు కారణం అయినప్పటికీ… బీజేపీతో పొత్తును ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న టీడీపీ కార్యకర్తలతో పాటు కొంతమంది నేతలు బీజేపీ నేతలు చేసిన పనికి లోలోపల థాంక్స్ చెప్పుకుంటున్నారంట.

ఇదే క్రమంలో… జనసేనతో పొత్తుకు బాబు ఆల్ మోస్ట్ కమిట్ అయిపోయారు. అటు పవన్ కూడా చంద్రబాబుపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. చంద్రబాబు పేరు చెప్పుకుని అయినా ఒకసారి అసెంబ్లీ గేటు తాకాలని కోరుకుంటున్నారు. అయితే ఈ సమయంలో జనసేనతో పొత్తును కూడా అనూహ్యంగా కొంతమంది టీడీపీ నేతలు, కార్యకర్తలూ వ్యతిరేకిస్తుండటం గమనార్హం.

10- 15 సీట్లు అయితే పర్లేదు కానీ… అంతకు మించి సీట్లు పవన్ అడుగున్న నేపథ్యంలో… జనసేనతో మాత్రం పొత్తు అవసరమా అని ఆన్ లైన్ వేదికగా చంద్రబాబుని ప్రశ్నిస్తున్నారు టీడీపీ కార్యకర్తలు. ఇంతకాలం పార్టీని, కేడర్ ను కాపాడుకుంటూ వచ్చి ఇప్పుడు జనసేన నేతలకు తమ స్థానాలు త్యాగం చేయాలా అని అడుగుతున్నారంట.

అయితే దీనికంతటికీ కారణం… ఏపీలో టీడీపీకి అనుకూల పవనాలు మొదలైపోయాయని, రాబోయే ఎన్నికల్లో మరోసారి టీడీపీ అధికారంలోకి రాబోతుందని తమ్ముళ్లు బలంగా నమ్మడమే! అయితే… తమకున్న నమ్మకం, ధైర్యం చంద్రబాబుకి లేకుండా పోయిందని ఈ సందర్భంగా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరి తమ్ముళ్ల నమ్మకానికి, ధైర్యానికి బాబు విలువిస్తారా.. ఒక్క సీటు కూడా త్యాగం చేయాల్సిన పరిస్థితిని టీడీపీ నేతలకు తీసుకొస్తారా.. లేక, జగన్ విషయంలో రిస్క్ ఎందుకు అని తలొగ్గుతారా అనేది వేచి చూడాలి!