2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకీ, జనసేన పార్టీకీ మధ్య పొత్తు ఖాయంగా కనిపిస్తోంది. సీట్ల పంపకాల విషయంలోనూ అతి త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ‘త్యాగాలకు సిద్ధంగా వుండాలి’ అంటూ గతంలోనే టీడీపీ శ్రేణులను సిద్ధం చేసేశారు.. పొత్తుల విషయమై.
ప్రస్తుతానికైతే జనసేన పార్టీ మాత్రం తమ మిత్రపక్షం బీజేపీయేనని చెబుతోంది. చంద్రబాబు తనను కలవడంపై జనసేనాని, చంద్రబాబు సమక్షంలోనే స్పందించారు.. ఇది ఎన్నికలకు సంబంధించిన భేటీ కాదని. ‘రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోయింది.. దాన్ని బతికిస్తే, ఆ తర్వాత ఎన్నికల గురించి మాట్లాడుకోవచ్చు’ అని జనసేనాని తేల్చి చెప్పారు.
రాజకీయ నాయకులు రాజకీయమే చేస్తారు. రెండు పార్టీల అధినేతలు కలుసుకుంటే, అక్కడ పొత్తుల చర్చలు రాకుండా ఎలా వుంటాయ్.? అందునా, చంద్రబాబుకి దత్త పుత్రుడిగా వైసీపీ విమర్శిస్తున్న దరిమిలా, ఆ పవన్ వద్దకు చంద్రబాబు వెళితే, ఖచ్చితంగా పొత్తుల చర్చలు వచ్చే వుంటాయి.
అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం టీడీపీ అధినేత చంద్రబాబు 60-40 ప్రతిపాదన పవన్ కళ్యాణ్ ముందుంచినట్లు తెలుస్తోంది. అంటే, టీడీపీ 60 శాతం సీట్లలోనూ, జనసేన 40 శాతం సీట్లలోనూ పోటీ చేయడం అన్నమాట. దీనికి జనసేనాని సుముఖత వ్యక్తం చేశారా.? లేదా.? అన్నదానిపై స్పష్టత రావాల్సి వుంది.
ఒకవేళ బీజేపీ కూడా కలిసొస్తే, ఆ పార్టీకి టీడీపీ కోటాలోంచే నాలుగైదు సీట్లు కేటాయించే అవకాశం వుందట. రెండు ఎంపీ సీట్లు బీజేపీకి ఇచ్చేందుకు చంద్రబాబు సుముఖంగా వున్నట్లు తెలుస్తోంది. బీజేపీ కలవకపోతే, వామపక్షాల్ని కలుపుకుపోవాలని, ఆ వామపక్షాలకు రెండు మూడు సీట్లయితే (అసెంబ్లీ సీట్లు మాత్రమే) సరిపోతాయని చంద్రబాబు భావిస్తున్నారట..