ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీలో ఇంటిపోరు జోరందుకుంటుంది. టిక్కెట్ల విషయంలోనూ, జనసేన సీట్ల పంపకాల విషయంలోనూ వీలైనంత తొందరగా క్లారిటీకి రానిపక్షంలో జరిగే డ్యామేజ్ భారీగానే ఉంటుందనే హెచ్చరికలు మొదలైపోయాయి. కానీ… చంద్రబాబు తన సహజశైలిలో చివరి వరకూ ఊరించే పనికి పూనుకుంటున్నారనే విమర్శలూ పెరిగిపోతున్నాయి. ఈ సమయంలో తాజాగా టీడీపీ కంచుకోటగా చెప్పుకునే చోట కొత్త తలనొప్పి స్టార్ట్ అయ్యింది.
చంద్రబాబుది మొహమాటమో, భయమో.. లేక, విపక్షాలు విమర్శిస్తున్నట్లు చివరి వరకూ నాన్చిన తర్వాత తేల్చే విధానమో తెలియదు కానీ… ఈ ఎన్నికలు అత్యంత కీలకం అని భావిస్తున్న వేళ ఆయన పద్దతిలో మార్పురావడం లేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. సీట్ల సర్ధుబాటు, అభ్యర్థుల ఎంపికలో చివరివరకూ నాన్చుడు ధోరణికి పోతే ఆఖరిలో అసంతృప్తులను బుజ్జగించడం జరిగే పనికాదనే కామెంట్లు వినిపిస్తున్నా ఆయనకు పట్టడం లేదని అంటున్నారు పరిశీలకులు.
ఇందులో భాగంగా… 2009, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా గెలిచి హ్యాట్రిక్ విక్టరీని సాధించిన పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో ఇప్పుడు కొత్త సమస్య తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా… ఓవైపు సిట్టింగ్, మరోవైపు మాజీ ఎమ్మెల్యేలు టికెట్ తనదంటే తనదంటూ పోటీపడుతున్నారు. ఎవరి ధీమాలో వారు ఉండి ప్రచారమూ ప్రారంభించేశారు. దీంతో ఎవరి వెంట నడవాలో తెలియక కార్యకర్తలు అయోమయంలో పడుతున్నారు.
ఈ నియోజకవర్గం నుంచి 2009, 2014 ఎన్నికల్లో ఉటుకూరి వెంకట శివరామరాజు (కలవపూడి శివ) గెలుపొందారు. ఈ క్రమంలో 2019 ఎన్నికల్లో ఆయనకు ఎంపీ టిక్కెట్ ఇచ్చిన బాబు… మంతెన రామరాజుని బరిలోకి దింపారు. అంతటి జగన్ వేవ్ లో కూడా రామరాజు గెలిచారు. దీంతో… ఈసారి టిక్కెట్ కచ్చితంగా తనదే అనే ధీమాతో ఆయన, ఆయన అనుచర్లు ఉన్నారు. నియోజకవర్గంలో తిరుగుతున్నారు.
అయితే అప్పుడు పార్టీ అవసరాలకోసం ఒక్కసారి తప్పుకున్నా తప్ప.. ఈ దఫా తప్పుకునేది లేదన్ని కలవపూడి శివ చెబుతున్నారని తెలుస్తుంది. దీంతో ఇరువురు నేతల మధ్య అంతర్గతంగా పోరు మొదలైందని తెలుస్తుంది. ఉండి నుంచి మరోసారి పోటీ చేసేందుకు మాజీ ఎమ్మెల్యే కలవపూడి శివ తన ప్రయత్నాలు తాను చేస్తున్నారు. ఈ సమయంలో చినబాబుని కూడా కలిశారనే చర్చ జరుగుతుంది.
ఈ క్రమంలో… ఉండిలో శివరామరాజు ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్నే సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజు వాడుతూ వస్తున్నారు. అయితే… తాజా పరిణామాల నేపథ్యంలో తన పార్టీ కార్యాలయాన్ని ఖాళీ చేయాలని సూచించడంతో.. సిట్టింగ్ ఎమ్మెల్యే మరోచోట టీడీపీ ఆఫీస్ ను ఓపెన్ చేశారు. దీంతో ఏ కార్యాలయానికి వెళ్లాలో తెలియక దిక్కుతోచని స్థితిలో పడ్డారు స్థానిక టీడీపీ కార్యకర్తలు.
దీంతో ఉండి టీడీపీలో గందరగోళ వాతావరణం మొదలైంది. ఈ క్రమంలో ఒకరు చినబాబుని, ఒకరు చంద్రబాబుని కలిశారనే చర్చ కూడా మొదలైంది. ఈ నేపథ్యంలో చివరి నిమిషం వరకూ నాన్చే అలవాటున్న బాబు.. ఆఖరి నిమిషంలో టిక్కెట్ ఎవరికి ఇచ్చినా… చీలిక కన్ ఫాం అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయంలో బాబు జోక్యం చేసుకుని వెంటనే ఈ సమస్యను పరిష్కరిస్తారా.. లేక, అసలుకే ఎసరు తెచ్చుకుంటారా అనేది వేచి చూడాలి.