మెజార్టీ సీట్లలో టీడీపీకి అభ్యర్థులు లేరా.?

2024 ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇప్పుడు నడుస్తున్నది 2022.. అది కూడా ఏడాది చివరకు వచ్చేశాం. ఇక, 2023 అంటే ఎన్నికల సంవత్సరంగానే భావించాల్సి వుంటుందనేది రాజకీయ వర్గాల్లో జరుగుతోన్న చర్చ. ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలూ ఎన్నికల సన్నాహాలు షురూ చేసేశాయ్. ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీలోనూ సీట్ల పంచాయితీ నడుస్తోంది. అభ్యర్థుల్ని ముందే ప్రకటించేయడం ద్వారా, ఆయా అభ్యర్థులు నియోజకవర్గాల్లో పని చేసుకోవడానికి వీలు కల్పించినట్లవుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు భావిస్తున్నారట. ఆ దిశగా నారా లోకేష్ కసరత్తులు ప్రారంభించినట్లు తెలుస్తోంది.

అయితే, ఇప్పుడున్న పరిస్థితుల్ని బట్టి చూస్తే.. తెలుగుదేశం పార్టీకి మెజార్టీ నియోజకవర్గాల్లో అభ్యర్థులు లేరట. ‘అధికార వైసీపీ నుంచి ఎవరెవరు దూకేస్తారా.?’ అన్న కోణంలో టీడీపీ ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీలోని అసంతృప్తులకు గాలం వేస్తోంది. కాగా, 175 సీట్లలోనూ ఈసారి గెలుస్తాం.. అని అధినేవ వైఎస్ జగన్ చెబుతుండడంతో, వైసీపీ నుంచి బయటకు వెళ్ళేందుకు పెద్దగా ఎవరూ సాహసించకపోవచ్చు. సహజంగానే, టిక్కెట్ ఆశించి భంగపడేవారుంటారు. అలాంటివారి మీదనే ఆశలు పెట్టుకుంది టీడీపీ.

వైసీపీ నుంచి వచ్చేవారి సంగతి పక్కన పెడితే, జనసేన బలంగా వున్న నియోజకవర్గాల గురించి టీడీపీ ఆరా తీస్తోంది. అక్కడ వున్న తమ ఆశావహులకు ఇప్పటినుంచే ‘పొత్తుల’ విషయమై స్పష్టత ఇచ్చేస్తోందట టీడీపీ. ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాలపై టీడీపీ పూర్తిగా జనసేనకే అవకాశమిచ్చేలా వుందట. ఇదిలా వుంటే, 100 సీట్లలో అయినా అభ్యర్థులు ఫలానా అని అనుకోవడానికే లేకుండా పోయిందంటూ టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.