జాతీయ, రాష్ట్ర స్ధాయిలో నలుగురు ఆర్ధిక ఉగ్రవాదులున్నారంటూ చంద్రబాబునాయుడు కోటరిలో కీలక నేత కుటుంబరావు తాజాగా ఆరోపించారు. కుటుంబరావు అవటానికి రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడే అయినా టిడిపి సీనియర్ నేతలాగే వ్యవహరిస్తున్నారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడంటే రాష్ట్రంలో ఖర్చవుతున్న నిధులు, దేనికెంత ఖర్చుపెట్టాలి, నిధుల సేకరణ ఎలా చేయాలి లాంటి అంశాలను చూసుకోవాలి. కానీ నిధుల సంగతిని పక్కనపెడితే వైసిపి, బిజెపి నేతలపై ఒంటికాలిపై ఎగిరెగిరి పడుతుంటారు. దాంతో కుటుంబరావు నిత్యం వార్తల్లోనే ఉంటున్నారు. అయితే ఈమధ్య ఎక్కడా కనిపించని ఈ ఉపాధ్యక్షుడు మళ్ళీ ఇఫుడు తెరపైకి వచ్చారు.
ఇంతకీ కుటుంబరావు ఏమన్నారంటే, నోట్టు రద్దు పెద్ద స్కామట. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జరిగిన అతిపెద్ద స్కాం నోట్లరద్దే అంటున్నారు. నోట్లరద్దు స్కాంలో నల్లధానాన్ని తెల్లధనంగా మార్చేసుకున్నట్లు ఆరోపిస్తున్నారు. అమిత్ షా కు చెందిన కో ఆపరేటివ్ బ్యాంకు ద్వారా నోట్లరద్దైన మొదటి నాలుగు రోజుల్లోనే అత్యధిక డబ్బును మార్చేసుకున్నట్లు తాజాగా ఆరోపణలు సంధించారు. నోట్లరద్దు వ్యవహారంలో ఎలాంటి కుంభకోణం లేకపోతే జెపీసీని ఎందుకు వేయటం లేదంటూ పెద్ద లా పాయింటే లాగారు. పెద్ద నోట్ల వినియోగాన్ని తగ్గించుకునేందుకు రద్దు చేశామని చెప్పిన ప్రభుత్వం 2 వేల రూపాయలను ఎలా ముద్రించిందంటూ మండిపడ్డారు.
రెండు వేల నోట్లతో ఎన్నికల్లో ఎలా గెలవాలో యూపి ఎన్నికల్లో బిజెపి రుజువు చేసిందని మండిపడ్డారు. అంతా బాగానే ఉంది కానీ నోట్లరద్దుపై జేపిసి ఎందుకు వేయలేదని అడగటమే విచిత్రంగా ఉంది. ఎవరైనా తమపై తామే విచారణ చేయించుకుంటారా ? రాష్ట్రంలో భారీ ఎత్తున అవినీతి జరిగిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే కదా ? మరి ప్రతిపక్షాల ఆరోపణలపై చంద్రబాబు విచారణ చేయించుకుంటారా ?
2019లో అధికారంలోకి వచ్చేవారు నోట్లరద్దు స్కాంపై దర్యాప్తు చేయాలని కూడా కుటుంబరావు డిమాండ్ చేస్తున్నారు. అంటే నరేంద్రమోడి మళ్ళీ ప్రధానమంత్రి కారని టిడిపి తీర్మానించేసుకున్నట్లున్నారు. జాతీయ స్ధాయిలో నరేంద్రమోడి, అమిత్ షా తో పాటు రాష్ట్ర స్ధాయిలో జగన్, విజయసాయిరెడ్డి ఆర్ధిక ఉగ్రవాదులుగా కుటుంబరావు అభివర్ణించటం విడ్డూరంగా ఉంది. ఎందుకంటే, ఆవు వ్యాసం లాగ టిడిపి ఎవరిని తిట్టటానికి మీడియా సమావేశం పెట్టినా చివరకు జగన్ ను శాపనార్ధాలు పెట్టందే ముగించటం లేదు.