అధికార తెలుగుదేశం పార్టీకి కొని నినాదాలు అవసరానికి భలేగా కలిసొస్తాయ్. తాను ఇబ్బందుల్లో పడ్డ ప్రతిసారీ, రాజకీయ ప్రత్యర్థిని ఇబ్బందుల్లోకి నెట్టేయడానికీ పనికొచ్చే నినాదాలు అవి. తెలుగుదేశం నేతలు కూడా వాటిని `అవసరానికి` తగ్గట్టుగానే వాడతారు. ఇష్టానుసారంగా వాటిని ప్రయోగిస్తే- పలుచబడి పోతాయనే విషయం వారికి బాగా తెలుసు. ఈ నినాదాల్లో ప్రధానమైనవి.. ఒకటి `తెలుగువారి ఆత్మగౌరవం`, రెండు `ఎన్టీఆర్‌కు భారతరత్న`.
ఈ రెండో నినాదాన్ని తెలుగుదేశాధీశుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అతి పొదుపుగా వాడుతుంటారు. మహానాడు చివరిరోజు తీర్మానాల్లో మాత్రమే `ఎన్టీఆర్ భారతరత్న` డిమాండ్ కనిపిస్తుంటుంది. ఆ తరువాత..మహానాడుకు వినియోగించిన కుర్చీలు, షామియానాలతో పాటు ఆ డిమాండ్‌ను కూడా అటకెక్కిస్తుంటారు.
ఇక మొదటిది కూడా అంతే! అవసరం వచ్చినప్పుడు మాత్రమే ఆ పదం తెలుగుదేశం నాయకుల నోటివెంట యథేచ్ఛగా దొర్లుతుంటుంది. టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ బుధవారం హైదరాబాద్‌లో ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. రాజకీయ ప్రత్యర్థిని ఇరకాటంలో పడేసే సమయం వచ్చింది. వెంటనే `తెలుగువారి ఆత్మగౌరవం` నినాదాన్ని అందుకున్నారు తెలుగు తమ్ముళ్లు.
వైఎస్ జగన్‌తో పక్క రాష్ట్ర పార్టీ ముఖ్య నాయకుడు భేటీ కావడంతోటే తెలుగువారి ఆత్మగౌరవం మంటగలిసిందని గళమెత్తారు. భూనభోంతరాలు ఏకమయ్యేలా నినదిస్తున్నారు. `ఉమ్మడి తెలుగు రాష్ట్రం విభజనకు కారణమైన ద్రోహులతో చేతులు కలపడమా.. ఆయ్!` అంటూ ఒంటికాలిపై లేస్తున్నారు. పదే పదే ఆత్మగౌరవం అనే పదాన్ని వాడుతున్నారు.
సరే! ఆ నినాదానికి పేటెంట్ రైట్స్ ఉన్న తెలుగుదేశం పార్టీ తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఇన్నాళ్లూ కాపాడుకుంటూ వచ్చిందా? అదీ లేదు. రాజకీయ ప్రయోజనాలు, కేసుల నుంచి బయటపడే మార్గాలను వెతుక్కోవడానికే సరిపోయింది చంద్రబాబుకు. దీనికోసం ఆయన ఎన్నిసార్లు మాట మార్చారో, ఎన్నిసార్లు ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారో కదా! అనిపిస్తుంది.
ఏ పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీని ఎన్టీ రామారావు స్థాపించారో, అదే పార్టీతో చంద్రబాబు పొత్తు పెట్టుకోవడంతోనే తెలుగువారి ఆత్మగౌరవం తునాతునకలైపోయింది. కేసీఆర్ భాషలో చెప్పాలంటే- పది అడుగుల లోతు బొంద తీసి ఈ నినాదాన్ని పాతిపెట్టారు. కాంగ్రెస్-టీడీపీ పొత్తు ఎంత అనైతికమో, దాని వెనక ఉన్న రాజకీయ లబ్ది ఏమిటో జన సామాన్యానికి ఇట్టే అర్థమౌతుంది.
దాని ప్రభావమేంటో తెలంగాణ ఎన్నికల్లో ప్రతిబింబించింది. తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న తెలుగుదేశం రెండు స్థానాల్లో, తెలుగుదేశంతో జట్టుకట్టిన కాంగ్రెస్ 20 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. టీడీపీతో పొత్తు పెట్టుకోవడం వల్లే దారుణంగా ఓటమి పాలయ్యామని టీ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించడం పరిస్థితి తీవ్రతను తెలియజేసింది.
నిజానికి- ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్‌తో కలిసి పోటీ చేయాలనేది టీడీపీ ఎత్తుగడ. కేసీఆర్‌తో పొత్తు కోసం చాలాసార్లు ప్రయత్నం చేశానని కూడా చంద్రబాబు బహిరంగంగా ప్రకటించారు. మోడీ వల్లే అది కుదర్లేదని నెపాన్ని ప్రధాని మీద నెట్టేశారు.
బావమరిది హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణిస్తే..ఆయన పార్థివదేహానికి నివాళి అర్పించడానికి వచ్చిన కేటీఆర్‌తో పొత్తుల గురించి మంతనాలు సాగించిన ఘనత చంద్రబాబుది. ఈ విషయాన్ని కూడా చంద్రబాబే వెల్లడించారు. సమయం, సందర్భం అని కూడా చూడకుండా తాను కేసీఆర్‌తో పొత్తుల కోసం ప్రయత్నించానని ఆయన చెప్పడం వెనుక ఉన్న కథ ఇదే. అప్పుడు కూడా తెలుగువారి ఆత్మగౌరవం గుర్తుకు రాలేదు చంద్రబాబుకు.
తెలంగాణలో ఎన్నికలు అనే నదిని దాటడమే చంద్రబాబుకు తక్షణ అవసరం. ఆ నది దాటాక తెప్పను తగలెయ్యడమో లేక, బోడి మల్లన్న అని వెక్కిరించడమో ఖచ్చితంగా జరిగి ఉండేది. చంద్రబాబు మనస్తత్వం కేసీఆర్‌కు బాగా తెలుసు. అందుకే ఆయనను ఎంత దూరం పెట్టాలో, అంత దూరం పెట్టారు. అదే సమయంలో- తాను నెలకొల్పడానికి ప్రయత్నిస్తోన్న ఫెడరల్ ఫ్రంట్‌లో జగన్‌ను ఆహ్వానించడం టీడీపీకి జీర్ణం కాని విషయం. ఎన్డీఏ, యూపీఏలకు సమదూరాన్ని పాటిస్తూ మూడో కూటమిని ఏర్పాటు చేయడానికి కేసీఆర్ ఓ చిరు ప్రయత్నాన్ని చేస్తున్నారు.
అదెంత వరకు సఫలమౌతుందన్నది పక్కన పెడితే, ఆ ప్రయత్నాలే చంద్రబాబుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తనకు మద్దతు ఇవ్వని ప్రతి పార్టీ.. తనకు వ్యతిరేకమే అనే సంక్షుభిత భావనలో పడిపోయారు చంద్రబాబు. మోడీ గానీ, కేసీఆర్ గానీ, జగన్ గానీ, చివరికి హైదరాబాద్ దాటి రాలేని ఒవైసీ గానీ చంద్రబాబుకు ఆజన్మ శతృవులుగా కనిపిస్తున్నారు. కేసీఆర్ అదృష్టం బాగుండి ఫెడరల్ ఫ్రంట్ గనక పూర్తిస్థాయిలో రూపుదిద్దుకుంటే చంద్రబాబు దుస్థితి ఎలా ఉంటుందో టీడీపీ నాయకులు ఊహించడానికే భయం వేస్తుండవచ్చు.
రేప్పొద్దున మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్ వంటి తటస్థ నాయకులు ఫెడరల్ ఫ్రంట్‌కు మద్దతు ఇస్తే- వారు కూడా దేశద్రోహులుగానే కనిపిస్తారు చంద్రబాబు కంటికి. మొన్నటిదాకా దేశద్రోహులు, ఇటలీ మాఫియా అంటూ నిప్పులు చెరిగిన కాంగ్రెస్ నేతలు చంద్రబాబుకు ఆప్తులయ్యారు. కారణం- తల దాచుకోవడానికి చంద్రబాబుకు కాసింత నీడ ఇవ్వడమే. అప్పుడు కూడా టీడీపీ నాయకులకు ఆత్మగౌరవం గుర్తుకు రాలేదు. జగన్-కేటీఆర్ ప్రాథమిక భేటీతోనే ఆత్మగౌరవానికి భంగం వాటిల్లిందంటూ గావుకేకలు పెట్టడం తెలుగుదేశం పార్టీ దీన స్థితికి అద్దం పడుతోంది.