ఛాలెంజ్ లు పోయి సాధింపులొచ్చే టాం టాం టాం…!

ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అమరావతి భూసమీకరణలో పెద్దఎత్తున ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని జగన్ ఆరోపిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. తాను అధికారంలోకి వస్తే దీనిపై విచారణ జరిపిస్తానని నాడే అసెంబ్లీ సాక్షిగా చెప్పారు జగన్! అనంతరం ఆయన అధికారంలోకి వచ్చారు.. అన్నట్లుగానే విచారణకు ఆదేశించారు.. అప్పుడు మైకులందుకున్న టీడీపీ నేతలు అంతా… ఏం పీక్కుంటావో పీక్కో అని ఛాలెంజ్ లు చేశారు.

గడచిన నాలుగేళ్ళుగా జగన్ ప్రభుత్వంపై చంద్రబాబు నాయుడు అండ్ కో… “ఎన్ని విచారణలైనా చేసుకో, ఎన్ని కేసులైనా పెట్టుకో, ఏం పీక్కుంటావో పీక్కో..” అని చాలెంజ్ చేసేవారు. అది నిజమైన ధైర్యమేమో, అది ధమ్మున్న చాలెంజ్ ఏమో.. నిజంగా అవినీతికి పాల్పడలేదేమో, అందుకే అంత ధైర్యంగా ఛాలెంజ్ లు చేస్తున్నారేమో అని అంతా భావించేవారు. కానీ… ప్రజల భావన తప్పని నిరూపిస్తూ… తమపై వేసిన విచారణలపై స్టేలు తెచ్చుకునేవారు టీడీపీ నేతలు. ఉండవల్లి తో చాలెంజ్ చేసిన జీవీ.. తీరా సమయం దగ్గరపడేనాటికి “బిజీగా ఉన్నాను” అని చెప్పినట్లు!

అది అమరావతి భూసమీకరణలో ఇన్ సైడర్ ట్రేడింగ్ అయినా… స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ముసుగులో అవినీతి జరిగిందనే విషయంపై అయినా… ఫైబర్ నెట్ కుంభకోణంలో కోట్లాది రూపాయలు చేతులు మారిన ఆరోపణలపై అయినా… భూసమీకరణలో భాగంగా అసైన్‌మెంట్ ల్యాండ్స్ కుంభకోణం జరిగిందనే అంశమైనా…. మీడియా ముందు ఛాలెంజ్ లు, తెరవెనుక స్టే లు టీడీపీ నేతలకు పరిపాటిగా మారిపోయింది!

అయితే గత కొన్ని రోజుల క్రితం సుప్రీంకోర్టు ఏపీసర్కార్ కి అనుకూలంగా తీర్పిచ్చింది! గత ప్రభుత్వ హయాంలో జరిగాయని చెబుతున్న అవకతవకలపై విచారణ చేసుకోవచ్చని అనుమతి ఇచ్చింది! దీంతో ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది.. సీబీ సీఐడీ రంగంలోకి దిగింది.. దర్యాప్తులో వేగం పెంచింది.. ఆఖరికి చంద్రబాబు నివాసం ఉంటున్న కరకట్ట ఇంటిని కూడా అటాచ్ చేసింది. దీంతో… టీడీపీ నేతల స్వరాలు మారాయి.

అమరావతి భూ కుంభకోణం, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కుంభకోణం, అసైన్డ్ ల్యాండ్స్ కొనుగోలు కుంభకోణం, ఫైబర్ నెట్ కుంభకోణంపై వరుసగా దర్యాప్తును ముమ్మరం చేసింది ఏపీ సర్కార్. త్వరలో నిందితుల అరెస్టులు కూడా ఉండొచ్చన్న కథనాలు తెరపైకి వస్తున్నాయి. ఒకరు ఒకలా ఇంకొకరు మరోలా… పొంతనలేని వాదనలు వినిపించడం టీడీపీ నేతల వంతైంది. దీంతో… ఇంతకాలం చేసిన “ఏం పీక్కుంటావో పీక్కో” అనే ఛాలెంజ్ ల స్థానంలో… “వేధింపులు, కక్షసాధింపులు” అంటూ కొత్త గోలలు తెరపైకి వచ్చాయి. దీంతో.. విస్తుపోవడం ఏపీ ప్రజల వంతవుతుంది!