రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం అయి వుండీ.. 40 ఏళ్ళ రాజకీయం తన సొంతమని చెప్పుకుంటోన్న తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు.. ఎన్నికల వేళ, ఓటర్లను ఉద్దేశించి ‘మీకు సిగ్గు లేదు’ అని అనడం ఎంతవరకు సబబు.? బెదిరించడం ఎంతవరకు సబబు.? ఓట్లు అడుక్కోవాలి ఏ రాజకీయ పార్టీ అయినా.. కానీ, చంద్రబాబు మాత్రం బెదిరింపులకు దిగారు.. ప్రజల్ని అవమానించారు. ఫలితం, మునిసిపల్ ఎన్నికల్లో చావు దెబ్బ.
సుదీర్ఘ రాజకీయ అనుభవం తన సొంతమని చెప్పుకుంటే సరిపోదు.. ప్రజల్ని ఎలా గౌరవించాలో తెలుసుకోవాలి. ఇన్నేళ్ళ రాజకీయంలో చంద్రబాబు అది తెలుసుకోలేకపోయారు. టీడీపీ డబ్బులు పంచితే అది ఘనకార్యమా.? వైసీపీ డబ్బులు పంచితే అది నేరమా.? ఎవరు చేసినా నేరం అనేది నేరమే. కానీ, చంద్రబాబు చర్యల కారణంగా, ఓటర్లు ఖచ్చితంగా ప్రత్యామ్నాయం వైపు చూస్తారు.. చూస్తున్నారు కూడా. అధికార వైసీపీకి స్థానిక ఎన్నికల్లో అడ్వాంటేజ్ వుంటుంది.. అది పంచాయితీ ఎన్నికల్లో కనిపించింది, మునిసిపల్ ఎన్నికల్లో కనిపించింది. చాలా చోట్ల ప్రతిపక్షం టీడీపీ పుంజుకోవాల్సి వుండగా, చంద్రబాబు పుణ్యమా అని టీడీపీ వెనక్కి వెళ్ళిపోతే, ఆ స్థానంలోకి జనసేన వచ్చింది.
రాష్ట్రంలో ఇప్పుడు ప్రతిపక్షం కోణంలో చూసుకుంటూ పొలిటికల్ వాక్యూమ్ వుంది. దాన్ని జనసేన భర్తీ చేయగలదా.? అన్నదే ప్రస్తుతానికి మిలియన్ డాలర్ల ప్రశ్న. భర్తీ చేయగలిగితే మాత్రం జనసేన పార్టీకి మంచి భవిష్యత్తు వుంటుంది. ఉభయ గోదావరి జిల్లాల్లోనే కాదు, రాష్ట్రంలోని పలు జిల్లాల్లో జనసేన బలం పుంజుకుంది. అయితే, బీజేపీతో స్నేహం కారణంగా జనసేన ఎదగలేకపోతోంది. తెలంగాణ బీజేపీ మీద గుస్సా అవుతున్న జనసేనాని పవన్ కళ్యాణ్, ఏపీ బీజేపీ విషయంలో కూడా అదే వైఖరి ప్రదర్శిస్తే అది జనసేనకు మంచిది.