ఆంధ్రప్రదేశ్: కొన్ని రోజుల నుంచి రాష్ట్రవ్యాప్తంగా గ్యాప్ లేకుండా వర్షాలు కురవడంతో కృష్ణానదికి భారీగా వరద వస్తోంది. కృష్ణా నది కరకట్ట లోపల వైపు ఉండే నివాసాలకు వరద ముప్పు ఉండటం వలన మరోసారి అధికారులు ఖాళి చేయాల్సిందిగా నోటీసులిచ్చారు. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని గెస్ట్ హౌస్‌కు మరోసారి నోటీసులు పంపారు.గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం అమరావతి కరకట్ట వెంబడి ఉండవల్లి గ్రామంలోని లింగమనేని గెస్ట్ హౌస్‌లో చంద్రబాబు నివాసం ఉంటున్నారు. తాడేపల్లి తహసీల్దార్ మంగళవారం ఆయన నివాసానికి నోటీసులు జారీ చేశారు.
తాడేపల్లి మండల పట్టణ పరిధిలో కృష్ణా నది వరద నీటి ముంపునకు గురయ్యే అన్ని ఇళ్లకు నోటీసులు ఇచ్చినట్టు అధికారులు తెలియజేశారు. చంద్రబాబు ఇంటితో సహా మరో 36 ఇళ్లకు ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తూ నోటీసులిచ్చినట్టు తెలిపారు. కరకట్ట నిర్మాణాలను ఖాళీ చేయాల్సిందేనని.. సురక్షిత ప్రాంతాల్లోకి వెళ్లాలని అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. కృష్ణా నదికి వరద అంతకంతకూ పెరుగుతోందని.. ఏక్షణమైనా వరద ఇంట్లోకి రావచ్చని అధికారులు హెచ్చరించారు.
కృష్ణానది కరకట్ట మీద ఉన్న లింగమనేని గెస్ట్ హౌస్‌లో చంద్రబాబు నివాసం ఉండటంపై గతంలోనూ వివాదాలు చెలరేగాయి. అది అక్రమ కట్టడమని.. దానిని కూల్చేస్తామని అధికారులు పలుసార్లు నోటీసులు జారీ చేశారు. అయితే దీనిపై ఇంటి యజమాని లింగమనేని రమేశ్ హైకోర్టును ఆశ్రయించారు. ఇక ఈ ఇంటి అంశంపై చంద్రబాబును వైసీపీ అనేక సార్లు టార్గెట్ చేసింది. చంద్రబాబు అక్రమ నిర్మాణంలో ఉంటున్నారని వైసీపీ నేతలు ఇప్పటికీ ఆరోపిస్తూనే ఉన్నారు.