సర్వే రిపోర్ట్స్.! వైసీపీ నేతలే నమ్మట్లేదా.?

‘నా నియోజకవర్గంలో వైసీపీ మళ్ళీ గెలుస్తుందా.? నాకే డౌట్‌గా వుంది..’ అంటూ వైసీపీకి చెందిన ఓ కీలక నేత తన సన్నిహితుల వద్ద ఇటీవల వ్యాఖ్యానించాడట. ఆ విషయం కాస్తా బయటకు పొక్కేసింది. ఎవరా వైసీపీ నేత.? అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.!

ఇలా ఒకరు కాదు, ఇద్దరు కాదు.. పలువురు వైసీపీ నేతలు, నోరు జారేస్తున్నారు.! సన్నిహితుల వద్ద నోరు జారుతున్నారా.? లీకులు ఇస్తున్నారా.? అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ‘వైనాట్ 175’ అంటోంటే, వైసీపీలో కొందరు నేతల తీరు మాత్రం, అందుకు భిన్నంగా వుంది.

ఇటీవల ఓ సర్వే వెలుగు చూసింది. అందులో, వైసీపీ వచ్చే ఎన్నికల్లో మొత్తంగా అన్ని ఎంపీ సీట్లనూ కొల్లగొట్టేస్తుందని పేర్కొన్నారు. టీడీపీ అదృష్టం బావుంటే, ఒక్కటి గెలిచే అవకాశం వుందన్నది ఆ సర్వే సారాంశం. ఆ అవకాశం కూడా వుండదనీ, తామే మొత్తం గెలిచేస్తామనీ వైసీపీ చెబుతున్న సంగతి తెలిసిందే.

సర్వే సారాంశం నిజమే అయితే, సర్వే నిజంగానే పద్ధతిగా జరిగి వుంటే, వైసీపీ నేతల్లో కొందరు మీడియాకి లీకులు ఎలా పంపగలుగుతున్నారు.? రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో వైసీపీ 22 ఎంపీ సీట్లను గెలిచింది. మూడింటిని టీడీపీ గెలుచుకుంది.

వైసీపీ గెలుచుకున్న 22 ఎంపీ సీట్లలో, నర్సాపురం నియోజకవర్గం.. ఆ తర్వాత దూరమైనట్టే. ఆ పార్టీకి చెందిన ఎంపీ రఘురామకృష్ణరాజు వైసీపీకి దూరంగా వున్నారు. వైసీపీకి చెందిన ఎంపీల లిస్టు తీస్తే, ప్రజలకు దగ్గరగా వుంటోన్నవారి సంఖ్య సగం కూడా వుండదు.

ఎమ్మెల్యేల మీద స్థానికంగా ఎంత వ్యతిరేకత వుందో, అంతకు మించిన వ్యతిరేకత ఎంపీల మీదనా వుంది. కాకపోతే, సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయనీ, వైఎస్ జగన్ ఇమేజ్ వల్లనే పార్టీ గెలిచేస్తుందనీ చాలామంది వైసీపీ నేతలు ధీమాతో వున్నారు. ఆ ధీమా మాత్రం ప్రజా ప్రతినిథుల్లో కనిపించడంలేదు.