28 సంవత్సరాల తర్వాత సుప్రీం కోర్టు ముంగిట షాద్ నగర్ జంట హత్యల కేసు
కడప జిల్లా రాజకీయాలపై ప్రభావం చూపనున్న తీర్పు
(యనమల నాగిరెడ్డి)
28 సంవత్సరాల పాటు వివిధ న్యాయస్థానాల గడపలు దాటుకుని 2008లో సుప్రీం కోర్టు చేరిన “షాద్ నగర్ జంట హత్యల కేసు చివరకు ఈనెల 24న విచారణకు రానుంది. 1990 లో ఈ సంఘటన జరిగినప్పటి నుండి నేటి వరకూ కడప జిల్లా రాజకీయాలను ప్రభావితం చేస్తున్న ఈ కేసు ఏ మలుపు తీసుకుంటుందోనని రాజకీయపార్టీలతో పాటు ప్రజలు కూడా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. జమ్ములమడుగు నియోజకవర్గానికి సంభందించిన ఈ ఘటనపై ఆ ప్రాంత ప్రజలు సుప్రీం కోర్టు నిర్ణయం కోసం మరింత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
షాద్ నగర్ జంట హత్యల కేసు పూర్వాపరాలు
1990 డిసెంబర్ 5న హెదెరాబాద్ నుంచి జమ్ములమడుగుకు వస్తున్నదేవగుడి శంకర్ రెడ్డి (ప్రస్తుత మంత్రి ఆదినారాయణ రెడ్డి చిన్నాన్న), భీమగుండం గోపాల్ రెడ్డి లను వారి ప్రత్యర్థులు మాజీ మంత్రి టీడీపీ నాయకుడు గుండ్లకుంట శివారెడ్డి అనుచరులు దారుణంగా చంపారు. అప్పట్లో ఈ సంఘటన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోనూ, కడప జిల్లాలోనూ సంచలనం రేపింది. ఈ కేసులో షాద్ నగర్ పోలీసులు మాజీమంత్రి శివారెడ్డి,ఆయన సోదరుడి కుమారుడు టీడీపీ నాయకుడు రామసుబ్బారెడ్డి, ఆయన సమీప బంధువు విశ్వేశ్వర రెడ్డి, సుగమంచి పల్లె వెంకట్రామిరెడ్డి, ఆయన ముగ్గురు సోదరులు,మరో 5 మందిపై (మొత్తం 11 మంది) శంకరరెడ్డి బంధువులు కేసు పెట్టారు.
1987 మండల ఎన్నికలలో మండల అధ్యక్షపదవికి పోటీ చేసిన భీమగుండం గోపాలరెడ్డి భార్య, అప్పటికి టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న శివారెడ్డి భార్యను ఓడించి, జమ్ములమడుగు నియోజకవర్గంలో శివారెడ్డి ఆధిపత్యానికి సవాల్ విసిరిందని, అందువల్లనే ఈ హత్యలు జరిగాయని పోలీసులు తమ విచారణలో పేర్కొన్నారు. (అయితే ఈ సంఘటన జరిగే సమయానికి రామసుబ్బారెడ్డి రాజకీయాలలోలేరని, వ్యాపారం చేసుకుంటూ ఉన్నారనేది బహిరంగ రహస్యమే.)
ఈ కేసును విచారించిన నాంపల్లె సెషన్స్ కోర్టు నేరాన్ని నిర్దారిస్తూ 2004 డిసెంబర్లో వీరందరికి శిక్షలు విధించింది. ఆ తర్వాత ఈ కేసును విచారించిన హైకోర్టు ఇరువురు జడ్జీల ధర్మాసనం భిన్నాభిప్రాయం వ్యక్తం చేయడంతో, ఈ కేసును మూడవ న్యాయమూర్తికి నివేదించడం, ఆయన ముద్దాయిలకు అనుకూలంగా కేసు కొట్టి వేస్తూ తీర్పు చెప్పారు.
ఈ నేపథ్యంలో శంకరరెడ్డి కొడుకులు, ఆయన సోదరుడి కొడుకులు సుప్రీం కోర్టులో దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను 2008లో విచారణకు స్వీకరించింది. అలాగే ప్రస్తుత తెలంగాణా ప్రభుత్వం కూడా ఈ కేసులో పిటీషన్ దాఖలు చేసిందని తెలుస్తున్నది.
ఈ కేసులో ఉన్న 11 మంది ముద్దాయిలలో ఏడు మంది కాలగర్భంలో కలసిపోగా ప్రస్తుతం నలుగురు మాత్రమే బ్రతికి ఉన్నారు. మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి, శివరామిరెడ్డి, విశ్వేశ్వరరెడ్డి, నారాయణ రెడ్డి ప్రస్తుతం విచారణ ఎదుర్కొంటున్నారు.
అక్టోబర్ 24న విచారణ
ఈ రెండు స్పెషల్ లీవ్ పిటీషన్ లను సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ భానుమతి ల ధర్మాసనం ఈ నెల 24న విచారించనుందని, అందుకోసం ఇరు పార్టీలకు చెందిన ప్రముఖులు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారని ఆ వర్గాలు తెలియచేశాయి.
కాగా ఇటీవల ముఖ్యమంత్రి చంద్ర బాబు మంత్రి ఆదినారాయణ రెడ్డికి, రామసుబ్బా రెడ్డికి రాజి చేసారని, అందుకు అనుగుణంగా ఈ కేసును నడపాలని సూచించారని, అందులో భాగంగా మంత్రి ఆదినారాయణ రెడ్డి కేసు ను ఉపసంహరించుకోడానికి లేదా రాజి అయినట్లు కోర్టుకు తెలియచేయవలసిందిగా వారి న్యాయవాదికి మౌఖికంగా సూచించారని పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే మంత్రి ఆదినారాయణ రెడ్డి సూచనలతో విభేదించిన శంకరరెడ్డి కుమారుడు శివనారాయణ రెడ్డి ఈ నెల 5న ప్రత్యేకంగా సుప్రీం కోర్టులో ఒక అఫిడవిట్ దాఖలు చేయడం జరిగిందని ఆ వర్గాలు వివరించాయి.
కడప జిల్లా రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేయగల ఈ అంశంపై సుప్రీంకోర్టు తీర్పుఎలా ఉంటుందోనని ఆ రెండు కుటుంబాల సభ్యులతో పాటు, రెండు ప్రధాన రాజకీయపార్టీలు, ప్రజలు ఎదురు చూస్తున్నారు.