ఏపీలోని బీజేపీ నేతలు… టీడీపీ నేతలేమో అనే అనుమానం నిత్యం కలుగుతూ ఊంటుంది. టీడీపీ విషయమలో వారు చూపిస్తున్న ఉత్సాహం, వారు చేస్తున్న వ్యాఖ్యలు.. టీడీపీలో ఉన్న నేతలు సైతం ఆశ్చర్యపోయేలా ఉంటుంటాయి. ఈ విషయంలో కమళాన్ని వదిలి ఎప్పుడు సైకిల్ ఎక్కేద్దామా అని ఎదురుచూస్తున్న వారిపై సోము వీర్రాజు… ఏపీ బీజేపీ చీఫ్ హోదాలో కాస్త సీరియస్ యాక్షన్ తీసుకోవాలని ఫిక్సయ్యారంట. ఆ లిస్ట్ లో ప్రస్తుతానికి ముగ్గురు పేర్లు బలంగా వినిపిస్తున్నాయి.
ఏపీలో బీజేపీ నాయకులుగా కొనసాగుతూ, టీడీపీ శ్రేయోభిలాషులుగా ప్రవర్తించే ముగ్గురు నేతలపై సోము వీర్రాజు సీరియస్ గా దృష్టి సారించారని తెలుస్తుంది. వారిలో మొదటివారు విష్ణు కుమార్ రాజు అని తెలుస్తుంది. ఇటీవల ఒక న్యూస్ ఛానల్ లో విశాఖ బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు చేసిన వ్యాఖ్యలను బీజేపీ రాష్ట్ర నాయకత్వం సీరియస్ గా తీసుకుందట. తెలుగుదేశం పార్టీతో పొత్తు ప్రస్తావన, బీజేపీ ఒక్క సీటు కూడా గెలవలేదని మోడీకి, అమిత్ షా కు తాను చెప్పానని చెప్పడం వంటి కారణాలపై ఆయన సంజాయిషీని కోరింది.
అయితే ఒంటరిగా వెళితే బీజేపీకి ఏపీలో ఒక్క సీటు కూడా రాదని తాను గతంలో మోడీకి లేఖ రాశానని విష్ణుకుమార్ రాజు వివరణ ఇచ్చినట్లు తెలిసింది. అయితే దీనిపై రాష్ట్ర నాయకత్వం కూడా.. కేంద్ర నాయకత్వమే చర్యలు తీసుకునేలా ప్లాన్ చేసినట్లు సమాచారం. త్వరలోనే విష్ణుకుమార్ రాజును పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశాలున్నాయని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తుంది. ఈ ఇంటర్వ్యూలో టీడీపీలో చేరుతున్న తేదీ తప్ప… ఆల్ మోస్ట్ అన్ని విషయాలపైనా విష్ణు క్లారిటీ ఇచ్చేశారు!
ఇక రాయలసీమ ప్రాంతానికి చెందిన మరో కీలక నేతకు కూడా బీజేపీ రాష్ట్ర నాయకత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ కు ఈ నోటీసులు జారీ చేసింది. నారా లోకేష్ కర్నూలు నగరంలో పాదయాత్ర చేస్తుండగా ఆయనకు స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో టీజీ వెంకటేష్ ఫొటో ఉండటంపై వివరణ కోరింది. దీంతోపాటు ఆయన కుమారుడు టీజీ భరత్ కర్నూలు టీడీపీ ఇన్ ఛార్జి గా ఉన్న అంశాలను కూడా సీరియస్ గా తీసుకుందట. అధికారికంగా బీజేపీలో ఉంటూ.. టీడీపీతో లోపాయికారీ ఒప్పందం చేసుకున్నారన్న విమర్శలు వినిపిస్తుండటంతో ఈ షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది.
ఇదే క్రమంలో… జమ్మలమడుగులోనూ ఆదినారాయణ కుటుంబంలో కొందరు టీడీపీలో ఉండగా.. ఆదినారాయణ రెడ్డి మాత్రం బీజేపీలోనూ కొనసాగుతున్నారు. ఈ క్రమంలో… బీజేపీ – టీడీపీ – జనసేన కలసి పనిచేస్తాయని ఇటీవల ఆదినారాయణరెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆదినారాయణ రెడ్డ్కి కూడా నోటీసులు జారీ చేసింది ఏపీ బీజేపీ. ఇందులో భాగంగా… కేంద్ర నాయకత్వం నుంచి అనుమతి తీసుకున్న అనంతరం ఈ ముగ్గురిపై వీలైనంత తొందర్లో వేటు పడే అవకాశాలున్నాయని తెలుస్తుంది!
ఏది ఏమైనా… మిగిలిన విషయాలతో పోలిస్తే… ఈ కోవర్టుల విషయంలో సోము దూకుడు ప్రదర్శిస్తున్నారనే కామెంట్లు ఈ సందర్భంగా బలంగా వినిపిస్తున్నాయి!