సుప్రీంలో ఏపీ ప్ర‌భుత్వానికి ఊర‌ట‌ … హైకోర్టు ఆదేశాల‌పై సుప్రీం స్టే !

ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఏపీలో రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందో లేదో తేలుస్తామని.. దీనిపై విచారణ జరుపుతామని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందా లేదా అనే విష‌యాన్ని తేలుస్తామని అక్టోబర్ 1న హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

cm jagan high court
 

దీనిపై ఏపీ స‌ర్కార్‌ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు సీజే జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం విచార‌ణ జ‌రిపింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై యథాతథస్థితి కొనసాగించాలని సూచించింది. తదుపరి విచారణ శీతాకాలం సెలవుల తర్వాతకు వాయిదా వేసింది కోర్టు.

ఏపీలో పోలీసులు చట్ట ఉల్లంఘనలపై దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్లు, రాజధాని తరలింపు వ్యతిరేకిస్తూ శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న వారిపై పోలీసులు అడ్డుకుంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని టీడీపీ మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ దాఖలు చేసిన పిటిష‌న్‌పై హైకోర్టు విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ సర్కార్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది.