విశ్లేషణ: నాడు వైస్రాయ్.. నేడు అనుమోలు!

ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటం.. మరోపక్క ఈసారి ఎన్నికల్లో గెలవడం అత్యంత ప్రాముఖ్యం అయిన సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కొత్త కొత్త ప్లాన్స్ వేస్తున్నారు. ఈ సమయంలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను భారీగా జరిపించాలని ప్లాన్ చేశారు. ఎన్టీఆర్ అంటే… టీడీపీ ఓటు బ్యాంకు అని బలంగా నమ్మే బాబు.. ఈ దిశగా ఉత్సవాలను భారీగా ప్లాన్ చేశారు. ఆయన ఫోటో లేని, ఆయన ప్రస్థావన రాని టీడీపీని ఊహించుకోలేం. అది జరగదు కూడా..! అయితే… తాజాగా జరిగిన ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల ప్రారంభ సభపై విశ్లేషణ ఇప్పుడు చూద్దాం!

యుగపురుషుడు ఎన్టీఆర్:

ఎవరు అవునన్నా.. ఎవరు కాదన్నా.. ముందు అవునని, తెరవెనుక కదాన్నా.. అన్న ఎన్టీఆర్ ఎప్పటికీ యుగపురుషుడే! ఈ విషయం ఆయన్ని అభిమానించినవారికీ, ఆరాధించినవారికీ, ఆయన రాజకీయ బిక్షవల్ల ఎదిగినవారికి, పదవులు పొందినవారికీ, ఆయన్ను పదవీచిత్యున్ని చేసినవారికి, ఆయనపై చెప్పులు వేసీన వారికీ, వేయించినవారికీ… కడుపున పుట్టినవారికీ, అఖరిరోజుల్లో ఆయన మనోవేధనకు కారణమైనవారికి… అందరికీ ఈ విషయం తెలుసు. ఈ సభ సందర్భంగా… వక్తలంతా ఇదే విషయంపై ప్రసంగించారు. ఎన్టీఆర్ కీర్తి ప్రతిష్టలను కొనియాడారు.

ఎవడి డప్పు వాడు కొట్టండెహే…:

జరుగుతున్నది ఎన్టీఆర్ శతజయంతి సభ. అదే వేదికపై చంద్రబాబు చిరుమందహాసంతో కూర్చున్నారు. నందమూరి బాలకృష్ణ ఆసీనులయ్యారు. ఈ సందర్భంగా మైకందుకున్న మెజారిటీ వక్తలు… అసలు విషయం పక్కనెట్టి బాబుగురించి డప్పు కొట్టడం మొదలుపెట్టారు. ఇది ఎన్నికల ప్రచార సభ అయితే… ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ… ఎన్టీఆర్ జయంతి సభ అని పిలిచి.. బాబుకు డప్పు కొట్టడంపై అసలు సిసలు ఎన్టీఆర్ అభిమానులు హర్ట్ అయ్యారు. ఎన్టీఆర్ గురించి 20 శాతం మాట్లాడితే.. బాబు రాజకీయాలపై 80శాతం మాట్లాడినంత పనిచేశారు! దాంతో… ఈ జయంతి ఉత్సవాల నిర్వహణ ఉద్దేశ్యంపై ఒక క్లారిటీ వచ్చిందనే కామెంట్లు మొదలైపోయాయి.

తెరపైకి వైశ్రాయ్ హోటల్ సంఘటన:

ఎన్టీఆర్ శతజయంతి సభ ఒకపక్క జరుగుతుంటే… మరోపక్క కొంతమంది హార్డ్ కోర్ ఫ్యాన్స్… బాబు భజన వినలేక సభ నుంచి ఇబయటకొచ్చారు ఓ పెద్దాయన. వారు ఈ సందర్భంగా చెప్పిన మాటలు… వైశ్రాయ్ హోటల్ ఘటన గుర్తొచ్చిందని! అవును… “ఇవాళ ఎన్టీఆర్ ను ఎవరైతే ఆకాశానికెత్తేస్తున్నారు.. వారే ఒకప్పుడు ఆయనకు వ్యతిరేకంగా గోతులు తవ్వారు.. పరోక్షంగా ఆయన మరణానికి కారకులయ్యరు. వారంతా ఇవాళ అయన ఫోటోకు దండలేసేసి, ఆహో ఓహో అంటూ కీర్తిస్తున్నారు”… అంటూ కళ్లు తుడుచుకున్నారు పెద్దాయన!

మరణానికి కారకులు ఎవరెవరు…?:

ఎన్టీఆర్ ఫోటోకు చంద్రబాబు దండేసి, దండం పెట్టిన సన్నివేశం చూసిన ప్రతీసారీ… నాటి వైస్రాయ్ హోటల్ ఘటన గుర్తుకు వస్తుంది. తదనుగుణంగా “జామాత దశమగ్రహం” అనే సామెత కూడా మస్తిష్క నాడుల్లో మెదులుతుంటుంది. అష్ట దిక్పాలకుల్లా తండ్రిగా అండగా ఉండాల్సిన కొడుకులు మొత్తం మౌనసాక్షులుగా మిగిలిన వేళ.. నాలుగు వైపులా కూర్చుని కబుర్లు చెప్పిన కూతుర్లకు సైతం తండ్రి ప్రేమ గుర్తుకురాని వేళ.. ఆయన స్థాపించిన పార్టీ, నిర్మించుకున్న వ్యవస్థ… ఇంకొకరి చేతుల్లోకి వెళ్లిపోయింది. తన చేతుల మీదుగా బీ ఫారాలు అందుకున్న వారు ఆయన మీదే బూట్లూ, చెప్పులు వేశారు. చేరదీసినవారే అదనుచూసి వెన్నుపోటు పొడిచారు. ఈ వ్యవహారంతో పెద్దాయన మనసు కలత చెందింది.. తదనంతరం తనువు మృత్యుఒడికి చేరుకుంది!

అనుమోలు సభలో ఆహో.. ఓహో..:

ఎవరైతే ఎన్టీఆర్ నుంచి పార్టీని లాక్కున్నారో.. ఆయనను మానసికంగా ఇబ్బంది పెట్టారో.. ఆ వ్యక్తులే నేడు శత జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. నాడు వైశ్రాయ్ హోటల్ లో మీటింగ్ పెట్టిన వాళ్ళే.. నేడు విజయవాడ అనుమోలు గార్డెన్స్ లో ఎన్టీఆర్ వ్యక్తిత్వాన్ని కీర్తిస్తున్నారు! నాడు ఆయన్ని వ్యసనపరుడిగా, స్త్రీలోలుడిగా చిత్రించిన వారే… అనుమోలు సభ సాక్షిగా ఆయన చిత్రపటాలకు సన్మానాలు చేసేస్తున్నారు! మరణించినా కూడా ఆయన ఆత్మకు శాంతి చేకూరనివ్వకుండా ఇబ్బందిపెడుతున్నారు.

నాడూ నేడూ… రజనీకాంత్:

నాడు ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా చంద్రబాబు కట్టిన కూటమికి సంఘీభావం తెలిపిన రజనీకాంత్.. నేడు అదే ఎన్టీఆర్ కు నివాళి అర్పించడానికి అనుమోలు వచ్చారు. ఎన్టీఆర్ నుంచి పార్టీని లాక్కున్న తర్వాత తెలుగుదేశానికి చంద్రబాబు నాయుడు వన్ అండ్ ఓన్లీ అయ్యారు. మూడు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. అయితే… ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అందుకే 23 దగ్గరే ఆగిపోయిన పరిస్థితి. ఈ సమయంలో ఆ పార్టీకి కొత్త జవసత్వాలు కావాలి. అందుకే నాడు తనకు వైస్రాయ్ హోటల్ లో సంఘీభావం తెలిపిన బ్యాచ్ ను మళ్లీ పిలిపించుకుని, తనకు లేని భుజకీర్తులు తొడిగించుకునే ప్రయత్నం చేశాడు!