ఏపీ సీఎం జగన్ ఏ విషయంలోనూ అదరకుండా బెదరకుండా తనకు నచ్చిన విధంగా పరిపాలన కొనసాగిస్తూ వస్తున్న ఈ సమయంలో ప్రత్యర్థుల కారణంగా పెద్దగా భయం లేకపోయినా, సొంత పార్టీ నాయకులు వ్యవహారాలు పెద్ద తలనొప్పిగా మారాయి. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అన్ని ప్రభుత్వ పథకాలలోను ప్రజా ప్రతినిధులు జోక్యం లేకుండా, అమలు చేసుకుంటూ వస్తుండడం, పార్టీ నేతల్లో తీవ్ర ఆగ్రహం ఏర్పడింది. అదీ కాకుండా, ఎక్కడా, ఎవరూ అవినీతి వ్యవహారాలకు పాల్పడకుండా జగన్ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్నారు. దీంతో సహజంగానే ఆ పార్టీ నాయకుల్లో కాస్త అసంతృప్తి చెలరేగింది. అయితే ఇదంతా సర్వ సాధారణమే అన్నట్లుగా జగన్ మొదటి నుంచి పెద్ద సీరియస్ గా ఈ వ్యవహారాలను తీసుకోవడం లేదు. దీంతో సహజంగానే క్షేత్రస్థాయిలో కాస్తో కూస్తో వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు వస్తున్నాయి.
ముఖ్యంగా ప్రతిపక్షాలు కొంతమంది వైసీపీ నాయకులను టార్గెట్ చేసుకుంటూ, వ్యవహారాలు చేస్తూ వస్తున్నాయి. అయినా జగన్ నేరుగా ఈ విషయాల్లో కలుగజేసుకోకుండా, పార్టీ నేతల ద్వారానే, ఈ వ్యవహారాలను చక్కబెట్టే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. అయితే ప్రస్తుతం తెలంగాణలో అధికార పార్టీ టిఆర్ఎస్ దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటమి చెందడానికి అనేక కారణాలు దోహదం చేయడం, ముఖ్యంగా టిఆర్ఎస్ నాయకులు అవినీతి వ్యవహారాలు పెరిగి పోయినట్లుగా తేలడం, గెలుపు ఎప్పుడూ తమవైపే ఉంటుందని అధికార పార్టీ టిఆర్ఎస్ లో ఒక అభిప్రాయం రావడం, ఇలా ఎన్నో కారణాలతో ప్రజల్లోనూ అసంతృప్తి చెలరేగడం, ఇవన్నీ టిఆర్ఎస్ అభ్యర్థి ఓటమికి దోహదం చేశాయి. అయితే ఏపీలో త్వరలోనే తిరుపతి లో పార్లమెంటు ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో, తెలంగాణలో మాదిరిగా ఫలితాలు రాకూడదు అనే ఉద్దేశంతో జగన్ ఇప్పటి నుంచే అలర్ట్ అవుతున్నట్లు కనిపిస్తోంది.
ఒకవేళ తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి కనుక ఓటమి చెందితే , ఆ ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందని, ప్రతిపక్షాలు బలపడేందుకు ఆస్కారం ఉంటుందని నమ్ముతున్న జగన్ పూర్తిగా పార్టీని ప్రక్షాళన చేసేందుకు తానే స్వయంగా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఇటీవల విశాఖలో జరుగుతున్న పరిణామాలు కూడా కాస్త కలవరపెడుతున్నాయట. విజయసాయిరెడ్డిని టార్గెట్ చేసుకుంటూ సొంత పార్టీ ఎమ్మెల్యేలు విమర్శలు చేయడం, ఇవన్నీ జగన్ సీరియస్ గా తీసుకున్నట్లు గా కనిపిస్తున్నారు. ఈ మేరకు విశాఖ నేతలకు నేరుగా జగన్ వార్నింగ్ సైతం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇలా ఎక్కడికక్కడ అసంతృప్తులను గుర్తించి, ఆదిలోనే వారి వ్యవహారాలను కట్టడి చేయకపోతే ప్రభుత్వం దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని జగన్ అభిప్రాయపడుతున్నారట.
అదీకాకుండా తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికపై జగన్ ఎక్కువగా టెన్షన్ పడుతున్నట్లు వైసీపీలో పరిస్థితులు కనిపిస్తున్నాయి.ఒకవైపు తమకు పరోక్షంగా మద్దతు ఇస్తూ, అన్ని విషయాల్లో సహకరిస్తూ వస్తున్న బిజెపి సైతం ఇక్కడ రంగంలోకి దిగేందుకు ప్రయత్నిస్తూ ఉండటం కూడా జగన్ ను టెన్షన్ పెడుతున్నట్లుగా తెలుస్తోంది .